వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ, గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. కాని ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడుస్తోందట. ఈ ఇద్దరి మధ్యా తలెత్తిన ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట.
చానా క్లోజ్.. అయినా డిఫరెన్సెస్
మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. అందరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోందట. బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు.
వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గతంగా ఇద్దరి మధ్యా యుద్ధమే జరుగుతోందని టాక్. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ కవిత భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇద్దరు మహిళా నేతలు ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట.
నాయక్ వర్సెస్ రాథోడ్
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పలుమార్లు రెడ్యానాయక్ పై ఓటమి పాలయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ లో చేరగా ప్రత్యర్థిగా ఉన్న రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్ లో చేరడంతో సత్యవతి రాథోడ్ కు స్థానం లేకుండా పోయింది. 2018లో ఎమ్మెల్యే టిక్కెట్ రెడ్యానాయక్‌కే ఇచ్చి, సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు గులాబీ దళపతి.
చిరకాల ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ ఇద్దరికీ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. నిరంతర ఇరు కుటుంబాలు రాజకీయంగా పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న విభేదాలు కవితకు తలనొప్పిగా మారాయి.
మానుకోట గులాబీకి రెండు ముళ్లు
ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలే అని చెబుతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీ చేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపి కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ తో కవితకు విభేదాలు ఏర్పడ్డాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్ కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది.
మానుకోటలో అధికారపార్టీలో నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును నిశితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment