వాళ్లిద్దరూ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులు. ప్రస్తుతం గులాబీ గూటి నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సమయం దొరికినప్పుడల్లా మంత్రిపై ఆ ఎమ్మెల్యే సెటైర్లు వేస్తుండడం కలకలం రేపుతోంది.
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన డోర్నకల్‌లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలో ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. వారిలో ఒకరు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే, మరొకరు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకరి తర్వాత మరొకరు గులాబీ గూటికి చేరి అధికారాన్ని అనుభవిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అక్షరాల నిరూపిస్తున్నారు.
1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరుగగా ఆరుసార్లు రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు 1989, 2009, 2014లో సత్యవతి రాథోడ్‌తో రెడ్యానాయక్ తలపడ్డారు. ఒక్కసారి మాత్రమే 2009లో సత్యవతి చేతిలో రెడ్యానాయక్ ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో టీఆర్ఎస్‌లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యానాయక్ జయకేతనం ఎగురవేసి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్యానాయక్ పోటీ చేసి గెలుపొందగా-- టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్‌లో బెర్త్ ఇచ్చారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు.
గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించినా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికివారు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగనుండడంతో... ఇప్పటినుంచే భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెడ్యానాయక్ పనిచేయగా-- ప్రస్తుతం టీఎస్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ అదే శాఖతో టు స్త్రీ శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యానాయక్ సందర్భోచితంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం కలకలం రేపుతోంది. పైగా తనను మంత్రి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో తెలియడం లేదంటూ మరిపెడలో వ్యంగ్యస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది.
మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరగడంతో రెడ్యానాయక్ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అందుకు ఆమె సుముఖంగా లేనట్లు అనుచరులు చెబుతున్నారు. మూడుసార్లు డోర్నకల్ నుంచి పోటీచేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి రాథోడ్ నాలుగోసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారట. దాంతో డోర్నకల్ రాజకీయం రసకందాయంగా మారింది. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు టీఆర్‌ఎస్ టికెట్ దక్కుతుందా.. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment