తెలుగుదేశంలో పార్టీ పదవులను బరువుగా ఎందుకు భావిస్తున్నారు? చంద్రబాబు పిలిచి పదవులిచ్చినా వద్దని ఎందుకంటున్నారు? అసలు పదవులిస్తామంటే నాయకులు ఎందుకు పారిపోతున్నారు? టీడీపీ సోషల్ మీడియా సలహాదారు పదవిని తిరస్కరించిన ఆ సీనియర్ నేత ఎవరు? పదవి తీసుకోవడానికి ఎందుకు విముఖత చూపిస్తున్నారు?
తెలుగుదేశం పార్టీలో పిలిచి పదవులు ఇస్తుంటే..నాయకులు మాత్రం మాకు వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. పార్టీ అనుబంధ విభాగాల పదవులు తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని దుస్తితి తెలుగుదేశంలో ఏర్పడింది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా సలహాదారు పదవిని సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే తనకు ఆ పదవి వద్దని కేశవ్ నిర్మొహమాటంగా అధినేతకు చెప్పేసినట్లు సమాచారం. చంద్రబాబు ఆయన అవసరం కోసమే తమకు పదవులు ఇస్తున్నారే గాని..తమ మీద ప్రేమతో కాదని టిడిపి సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా సలహాదారు పదవి కూడా ఆ కేటగిరీలోనే కేశవ్కు ప్రకటించినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియా తరఫున ఐటీడీపీ కన్వీనర్ గా చింతకాయల విజయ్ పని చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో విజయ్‌కు అదనంగా కేశవ్, జీవి రెడ్డికి అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించింది. పయ్యావుల కేశవ్ మాత్రం ఈ పదవిని తీసుకునేందుకు సుముఖత చూపడం లేదు. పార్టీ నాయకత్వం ఇచ్చిన పదవిని బాధ్యతగా కాకుండా అదనపు బరువుగా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నియోజకవర్గాన్ని కూడా చూసుకోవలసిన బాధ్యత తనపై ఉందని కేశవ్ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు సోషల్ మీడియా సలహాదారు పదవి ఎందుకంటూ పెదవి విరుస్తున్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే కేశవ్ వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే పార్టీ నేతలు గుర్తుకు వస్తారని...2004 నుంచి పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీకి అనేక సేవలు చేసిన తనకు ఏమాత్రం గుర్తింపు లభించలేదంటున్నారు పయ్యావుల కేశవ్. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినా...చంద్రబాబు మర్చిపోయారని వాపోతున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినపుడు మంత్రి పదవి ఆశించిన తనకు భంగపాటే ఎదురైందని అంటున్నారు. కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని గుర్తు చేసుకుంటున్నారు. పరిటాల సునీతకి మంత్రి పదవి ఇచ్చి తనను అవమానించారని పేర్కొంటున్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి కాబట్టే తనకు సోషల్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారని, ఇదే పదవి ముందుగా ఎందుకు ఇవ్వలేదని పయ్యావుల ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న చింతకాయల విజయ్ వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ ఎన్నికల్లో పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం కోసమే తనకు ఈ పదవిని కట్టబెట్టారని కేశవ్ అభిప్రాయపడుతున్నారు. విజయ్ కు ఎన్నికల కోసం వెసులుబాటు కల్పిస్తే మరి తన నియోజకవర్గ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తనకి కూడా ఒక నియోజకవర్గం ఉందని..అక్కడ తిరగాల్సిన బాధ్యత తనకు లేదా అని అంటున్నారు. టిడిపిలో పయ్యావుల ఒక్కరే కాదు ఎంతోమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఇచ్చే పదవులను, బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి సేవలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక పక్కకు పెట్టే చంద్రబాబు విధానాలు నచ్చకే దూరంగా ఉంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment