Australia Vs India: Ajinkya Rahane Game Looking New Version Best Innings India WTC Final 2023 - Sakshi
Sakshi News home page

#AjinkyaRahane: 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే

Published Fri, Jun 9 2023 6:15 PM | Last Updated on Fri, Jun 9 2023 9:50 PM

Ajinkya Rahane Game Looking New Version-Best Innings-India WTC FInal - Sakshi

టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్‌ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. 

ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్‌ఫేజ్‌ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. 

జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్‌ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.

ఇంతలో ఐపీఎల్‌ 2023 సీజన్‌ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్‌కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్‌కే కెప్టెన్‌ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు.

గతంలో ఐపీఎల్‌ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన రహానే 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  ఐపీఎల్‌లో చూపెట్టిన సూపర్‌ ఫామ్‌ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసింది.  అయితే ఐపీఎల్‌ సమయంలో ఏప్రిల్‌ 23న మ్యాచ్‌ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్‌ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్‌ చేశాడు.

అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు.  ఐపీఎల్‌ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్‌ బౌలర్లు చెలరేగుతున్న వేళ​ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు.

తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్‌తో కలిసి కీలక ఇ‍న్నింగ్స్‌ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్‌ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్‌ వర్షన్‌ చూపించాడు. 

చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement