దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో MSR పేరు తెలియనివారు లేరు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్సార్ మనవడు కరీంనగర్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. కరీంనగర్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సిటీ నాదే అంటున్న MSR మనవడి పోరాటం ఎలా ఉండబోతోందో చూద్దాం..
రోహిత్ పొలిటికల్ ఎంట్రీ
కరీంనగర్ జిల్లాలో ఎం. సత్యనారాయణరావు పేరు తెలియనవారు ఉండరు. గాంధీల కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఎంఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవులు అనుభవించారు. జిల్లాలో చాలా కాలం తర్వాత ఆయన వారసుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ తాజాగా కరీంనగర్ సిటీ సమస్యలపై గళం ఎత్తుతున్నారు.
ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు 15 బృందాలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వీడియోలు, ఫోటోలు తీశారు. రోహిత్ రావ్ ప్రెస్ మీట్ పెట్టి తన స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. రెండు గంటల్లోనే నగరంలో 300 సమస్యలు గుర్తించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరడం లేదని విమర్శించారు. నగరపాలక సంస్థ విఫలం అయ్యిందని వేలెత్తి చూపుతూ.. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు దీనికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేయబోతున్నట్లు తన కార్యక్రమాల ద్వారా రోహి స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా నుంచి కరీంనగర్
ఆస్ట్రేలియాలో చదువుకున్న ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ 2007 లోనే ఆస్ట్రేలియన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ అనుబంధ సంస్థను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాతికాలంలో ఎమ్మెస్సార్ మరణంతో మనవడు రాజకీయ అరంగేట్రం కొంతకాలం ఆగింది.
ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లో ఎంట్రీ ఇచ్చి సీరియస్ రాజకీయాల్లోకి వచ్చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు కేడర్ తో తరలివెళ్లారు. రాహుల్ జోడో యాత్రకు మద్దతుగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. వరదల సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెస్సార్ మనవడిగా రోహిత్ రావ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద విషయమే. కాని గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పోటీ చేసిన లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్‌లో చేరడం.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం లోక్‌సభ సీటుపై ఆసక్తిగా ఉండటంతో.. ఈసారి కరీంనగర్ అసెంబ్లీ సీటు రోహిత్‌రావుకు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అటు వెలమ.. ఇటు పద్మశాలి
జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రోహిత్ రావ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ఎమ్మెస్సార్కు పార్టీలో ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఆయన మనవడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల టైంకి టికెట్ ఆశించే వారు మరికొంత మంది ప్రత్యక్షం అవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. రోహిత్ రావ్ భార్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం ఓట్లు కూడా కరీంనగర్ లో ఎక్కువే. అందువల్ల పద్మశాలి వర్గం ఓట్లు తనకే పడతాయని రోహిత్ రావ్ భావిస్తున్నారు. ఒకవైపు తన వెలమ సామాజిక వర్గం...మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఎమ్మెస్సార్ రాజకీయ వారసుడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment