
అన్నీ మంచి ‘ఆర్థిక’ శకునములే..!
• ద్వితీయార్ధం బాగుంటుంది:అసోచామ్
• అక్టోబర్‌లో ‘తయారీ’ రయ్: నికాయ్ పీఎంఐ
• క్యూ3 ఉపాధి అవకాశాలపై నీల్‌సన్ సర్వే ధీమా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడు వేర్వేరు సంస్థలు ఆశాజనక సంకేతాలను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (2016 అక్టోబర్-2017 మార్చి) భారత్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని అసోచామ్ బిజ్‌కాన్ సర్వే పేర్కొంది. అక్టోబర్‌లో ‘తయారీ’ రంగం బాగుందని నికాయ్ పీఎంఐ పేర్కొంది. ఉపాధి అవకాశాల మెరుగుపడ్డానికి సంబంధించి 2016 క్యూ3లో ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల్లో చూస్తే... భారతీయులే ఆశాజనకంగా ఉన్నట్లు నీల్‌సన్ సర్వే వివరించింది.
అమ్మకాల్లో వృద్ధి: అసోచామ్: అమ్మకాల్లో వృద్ధి, సంస్థల సామర్థ్యం మెరుగుదల వంటి అంశాలు ద్వితీయార్థం క్రియాశీలతకు కారణమని అసోచామ్ సర్వే పేర్కొంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ ‘యూ’ టర్న్ తీసుకోడానికి కారణంగా వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ‘టర్న్‌ఎరౌండ్’ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అక్టోబర్‌లో కొత్త ఆర్డర్లు: పీఎంఐ
కొత్త ఆర్డర్లు, కొనుగోలు క్రియాశీలత, ఉత్పత్తి పెరగడం వల్ల అక్టోబర్‌లో తయారీ రంగం చక్కటి పనితీరును ప్రదర్శించినట్లు నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. సెప్టెంబర్‌లో 52.1 పాయింట్ల వద్ద ఉన్న సూచీ, అక్టోబర్‌లో 54.4 పాయింట్లకు పెరిగినట్లు వివరించింది. ఇది దాదాపు 22 నెలల గరిష్ట స్థాయి. దేశంలో తయారీ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయనడానికి ఈ గణాంకాలు సంకేతాలుగా నిలుస్తున్నట్లు కూడా వివరించింది.
ఉపాధిపై భారతీయుల విశ్వాసం: నీల్సన్
మరోవైపు ఉపాధి అవకాశాలకు సంబంధించి విశ్వాసంపై ప్రపంచ వ్యాప్తంగా 66 దేశాల్లో గ్లోబల్ ఫెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ నీల్సన్ ఒక సర్వే నిర్వహించింది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్, వ్యయాలకు సంబంధించి 2016 క్యూ3లో (జూలై-సెప్టెంబర్) ప్రపంచవ్యాప్తంగా చూస్తే... భారతీయుల్లో ప్రగాఢ సానుకూల విశ్వాసం ఉంది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలు కలగలిపిన వినియోగ విశ్వాస సూచీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 128 పాయింట్ల వద్ద ఉంటే, తరువాతి క్వార్టర్‌కు ఇది 133 పాయింట్లకు ఎగసింది.