
ఈ ఏడాది 4 శాతం పైకి ఇన్సూరెన్స్ విస్తరణ!
దేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ ఈ ఏడాది చివరకు 4 శాతం మార్క్‌ను అధిగమించొచ్చని అసోచామ్ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: దేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ ఈ ఏడాది చివరకు 4 శాతం మార్క్‌ను అధిగమించొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇన్సూరెన్స్ విస్తరణ కొద్ది కొద్దిగా పెరుగుతోందని, 2014లో 3.3 శాతంగా ఉన్న విస్తరణ 2015 నాటికి 3.44 శాతానికి చేరిందని తన నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పలు బీమా పథకాలను ప్రవేశపెట్టడం సానుకూల ప్రభావం చూపిందని తెలిపింది. నివేదిక ప్రకారం.. బీమా రంగ సరళీకరణ జరిగిన తొలి దశాబ్ద కాలంలో ఇన్సూరెన్స్ విస్తరణ బాగా జరిగింది.
అంటే 2001లో 2.71 శాతంగా ఉన్న ఇన్సూరెన్స్ విస్తరణ 2009 నాటికి 5.20 శాతానికి పెరిగింది. కానీ తర్వాత విస్తరణలో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఇది 2014 నాటికి 3.3 శాతానికి క్షీణించింది. దీనికి నిబంధనల మార్పు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు కారణంగా నిలిచాయి. ఇక 2015లో దేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ 3.4 శాతంగా నమోదయ్యింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సగటు 6.2 శాతంగా ఉంది. 2015–16లో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారు 36 కోట్లుగా ఉన్నారు.