ఇంధన ధరల విధానం వక్రమార్గం: అసోచామ్
పన్నులు తగ్గించాలని డిమాండ్
న్యూఢిల్లీ: రవాణాకు కీలకమైన ఇంధనాలపై పన్ను రేట్లు తగ్గించాలని వాణిజ్య సంఘమైన అసోచామ్ పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని, మార్కెట్ ఆధారిత ధరల విధానం పన్నుల పెంపు కారణంగా పక్కదారి పడుతున్న అభిప్రాయాన్ని అసోచామ్ వ్యక్తం చేసింది. ‘‘వినియోగదారులు పెట్రోల్, డీజిల్‌పై మూడేళ్ల గరిష్ట స్థాయిలో చెల్లిస్తున్నారు. 2014 మే నెలలో బ్యారెల్‌కు 107 డాలర్ల నుంచి సగానికి సగం తగ్గిపోయిన పరిస్థితుల్లోనూ తరచూ పన్ను రేట్ల పెంపు వల్ల మార్కెట్ ఆధారిత ధరల విధానం వక్రమార్గం పడుతున్నట్టు వినియోగదారులు భావిస్తున్నారు’’ అని అసోచామ్ తన ప్రకటనలో పేర్కొంది.
క్రూడాయిల్ ధరలు గత మూడు నెలల కాలంలో 18 శాతం పెరగ్గా... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.65.40 నుంచి రూ.70.39కి పెరిగింది. వాస్తవానికి క్రూడాయిల్ ధర పెరుగుదల కంటే రిటైల్ విక్రయ ధరల పెంపు తక్కువగానే ఉందని అసోచామ్ గుర్తు చేసింది. ‘‘వినియోగదారులు దీన్ని గుర్తించేందుకు సుముఖంగా లేరు. 2014 మేలో బ్యారల్ 107 డాలర్లుగా ఉండగా, అదే ఏడాది జూన్ 1న లీటర్ పెట్రోల్ రిటైల్ ధర రూ.71.51. మరి 107 డాలర్ల నుంచి సగానికి అంతర్జాతీయ ధర పడిపోగా, ప్రస్తుతం రిటైల్ విక్రయ ధర అదే స్థాయిలో ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ ఆధారంగా ధరల విధానం అయితే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ విక్రయ ధర రూ.40కంటే తక్కువే ఉండాలి’’ అని అసోచామ్ పేర్కొంది.