పప్పుదినుసుల రేటు పైపైకి!
న్యూఢిల్లీ: సామాన్యుడిని అల్లాడించిన ఉల్లిపాయల ధరల మంట మాదిరిగానే ఈ ఏడాది పప్పుధాన్యాల రేటు కూడా ఎగబాకే అవకాశాలున్నాయా? అవుననే అంటోంది పారిశ్రామిక మండలి అసోచామ్ తాజా అధ్యయన నివేదిక. ఎల్ నినో(వాతావరణ మార్పులు) కారణంగా దేశంలో ఈ సంవత్సరం వర్షపాతం తగ్గొచ్చని, రుతుపవనాలు సక్రమంగా ఉండకపోవచ్చంటూ అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రభావంతో పప్పు ధాన్యాల ఉత్పత్తి పడిపోయి రేట్లు పెరిగిపోయేందుకు దారితీయొచ్చని అసోచామ్ అంటోంది. ‘దేశంలోని పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం వాటా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలదే. వర్షపాతం కొరత కారణంగా ఉత్పత్తి తగ్గి.. ధరలు పెరిగేఅవకాశం ఉంది. పప్పు ధాన్యాల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడటం, అధిక ధరలు, తలసరి లభ్యత తగ్గిపోవడం వంటి అంశాలు ఆందోళనకలిగిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది.
డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసం పెరగడం రేట్లను మరింత పెంచేలా చేయొచ్చని, దీన్ని ఎదుర్కోవడానికి తగిన చర్యలు అవసరమని కూడా అభిప్రాయపడింది. గత మూడేళ్లుగా ఉత్పత్తి పెరిగినప్పటికీ... రానున్న సంవత్సరాల్లో సరఫరాలకు మించి డిమాండ్ కొనసాగవచ్చని తెలిపింది. 2016 నాటికి భారత్‌లో 21 మిలియన్ టన్నుల(ఎంటీ) మేర పప్పుధాన్యాల వార్షిక ఉత్పత్తి ఉండొచ్చని... అయితే, డిమాండ్ మాత్రం సుమారుగా 23 ఎంటీలను తాకొచ్చని అంచనా. ప్రస్తుతం దేశంలో 22-23 మిలియన్ హెక్టార్లలో పంటసాగు జరుగుతుండగా.. 13-18 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదవుతోంది.