న్యూఢిల్లీ: అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాలుగేళ్లలోనే మెరుగైన స్థాయికి చేరడం, అదే సమయంలో రూపాయి విలువ పతనం అన్నవి మన దేశ ఎగుమతులకు మంచి అవకాశమని, నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ అభిప్రాయపడింది. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్ డాలర్ల (రూ.3.35 లక్షల కోట్లు)విలువైన ఎగుమతులు అమెరికాకు జరిగినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 4.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నాలుగేళ్లలోనే అధిక వృద్ధి రేటు ఇది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఎగుమతులు 303 బిలియన్ డాలర్లలో 16% అమెరికాకు వెళ్లినవే. వార్షికంగా 13.42% పెరిగాయి. భారతదేశ ఎగుమతులు... వస్తువులైనా, సేవలు అయినా అమెరికా అతిపెద్ద మార్కెట్. మరి అమెరికా ప్రస్తుత స్థాయిలోనే వృద్ధి చెందితే అది కచ్చితంగా భారత ఎగుమతులకు మంచిదే’’అని అసోచామ్ నివేదిక తెలిపింది.
అయితే, రూపాయి విలువ వేగంగా క్షీణించడం వల్ల దేశ దిగుమతుల బిల్లుపై భారం పడుతుందని, కానీ అదే సమయంలో ఎగుమతుల ద్వారా నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ వివరించింది. ఎగుమతులు మరింత గాడిన పడడం, జీఎస్టీ రిఫండ్‌లతో ఎగుమతిదారుల పోటీతత్వం ఇనుమడిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేందుకు వీలు కలుగుతుందని అసోచామ్ తెలిపింది. ఇంజనీరింగ్, కెమికల్స్, జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు మన దేశం నుంచి అమెరికాకు ఎక్కువగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment