భవిష్యత్తులో పసిడికి డిమాండ్
హిందువుల పర్వదినాల్లో అక్షయ తృతీయది ప్రత్యేక స్థానం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదని భావిస్తారు. ఈ రోజు అన్నపూర్ణ దేవి, పరుశురాముడు జన్మించడం, ఇదే రోజు కుబేరుడికి సంపద రావడం, వినాయకుడు మహాబారత రచనను ప్రారంభించడం వంటి అనేక సంఘటనలు జరగడంతో దీన్ని హిందువులు చాలా పవిత్రమైన దినంగా కొలుస్తారు. ఈ రోజు బంగారం కొంటే అది అక్షయము అవుతుందన్న నమ్మకం.
ఈ నమ్మకాల మాట అటుంచితే.. గత కొంతకాలంగా లాభాలు అందించని బంగారం రానున్న కాలంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
ధర మళ్లీ పైకే: అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, డాలరు రూపాయి మారకం వంటి అనేక అంశాల వల్ల ఏడాది కాలంగా బంగారం స్థిరంగా కదులుతోంది. కాని ఇదే సమయంలో చైనాలో బంగారం వినియోగం బాగా పెరుగుతోంది. రానున్న కాలంలో చైనాలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియాకి సంబంధించి పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇక్కడ కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సుంకాలు విధించి, దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో బంగారం లభ్యత తగ్గి ధరలు పెరిగే విధంగా చేస్తోంది. బాసెల్-3 నిబంధనలు అందుకోవడానికి ప్రపంచంలోని పలు బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి.
కాని ఇదే సమయంలో అంతర్జాతీయంగా కొన్ని రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మధ్య ప్రాచ్య, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ ఒత్తిళ్లు బంగారం ధరలను పెంచేవిధంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న కాలంలో బంగారం ధరలు మళ్లీ పై దిశగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈటీఎఫ్ బెస్ట్
ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ పథకాలతో పాటు బంగారానికి కూడా చోటు కల్పించాలి. ఈక్విటీ, డెట్‌లు నష్టాలు అందిస్తుంటే... వాటిని పూడ్చే శక్తి బంగారానికే ఉంది. నేరుగా బంగారాన్ని కొని భద్రపర్చడం కష్టమైన పని. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇప్పుడు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే స్వచ్ఛమైన బంగారాన్ని కొన్నట్లే. అంతేకాదు వీటిద్వారా బంగారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని అమ్ముకోవచ్చు. ఈ మధ్యనే ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్‌లపై అవగాహన పెరుగుతుండటంతో పుత్తడికి డిమాండ్ పుంజుకుంటోంది.
- లక్ష్మీ అయ్యర్, సీఐవో(డెట్), కోటక్ మ్యూచువల్ ఫండ్