డీమోనిటైజేషన్‌తో చిన్న సంస్థలకు విఘాతం
గ్రామీణ వినియోగం, ఉద్యోగాల కల్పనపైనా ప్రతికూల ప్రభావం
• వ్యవస్థీకృత రంగంలోని పెద్ద సంస్థలకు మాత్రం ప్రయోజనం
• అసోచామ్–బిజ్‌కాన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు చిన్న, మధ్య తరహా సంస్థలు, గ్రామీణ వినియోగం, ఉద్యోగావకాశాల కల్పనపై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అసోచామ్–బిజ్‌కాన్ సర్వే వెల్లడించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయం భారీ స్థాయి వ్యవస్థీకృత రంగాలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని తేలింది.
⇔ సర్వేలో పాల్గొన్న వారిలో 81.5 శాతం మంది చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎస్‌ఎంఈ) డీమోనిటైజేషన్ దెబ్బతీస్తుందని, దీని ప్రభావం మరో త్రైమాసికం పాటు ఉంటుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదే సమయంలో పెద్ద సంస్థలపై డీమోనిటైజేషన్ సానుకూల ప్రభావం చూస్తుందని ఇంతే శాతం మంది చెప్పడం విశేషం.
⇔ ప్రతికూల ప్రభావం పడే రంగాల్లో వ్యవసాయం, సిమెంట్, ఎరువులు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, రియల్టీ, రిటైల్ ఉండగా.. విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అనుకూల ప్రభావం ఉంటుందని తెలిసింది.
⇔ పెట్టుబడులు, వినియోగదారుల విశ్వాసం, డిమాండ్‌పై, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపుతుందని 66 శాతం మంది తెలిపారు.
⇔ కూరగాయలు, ఇతర ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టినందున ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపుతుందని 92% మంది చెప్పారు.