నోట్ల రద్దు ఆర్థిక రంగానికి మేలే: అసోచామ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ కార్యక్రమం దీర్ఘకాలంలో ఆర్థిక రంగానికి సానుకూల ప్రయోజనం కలిగిస్తుందని అసోచామ్ నివేదిక తెలిపింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని ఆమోదించడం బాగా పెరిగిందని, ఇది దీర్ఘకాలంలో మేలు చేస్తుందని తెలిపింది. ‘విప్లవాత్మక సంస్కరణల ద్వారా భారత పరిణామక్రమం’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం వల్ల చెల్లింపుల సేవల సంస్థలు, టెలికమ్యూనికేషన్, ఐసీటీ, ఇతర టెక్నాలజీల వినియోగం పెరుగుతుందని తెలిపింది.
పాలనలో మెరుగు, వ్యాపార అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలు, సంస్కరణలను సమర్థవంతంగా తక్షణం అమల్లో పెట్టడం వంటివి విదేశీ పెట్టుబడులకు భారత్‌ను అనుకూల గమ్యస్థానంగా కొనసాగేలా చేస్తుందని పేర్కొంది. వాణిజ్య పరంగా గణనీయమైన ప్రగతి, క్రీయాశీల విధాన చర్యలతో ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందని వెల్లడించింది. అయినప్పటికీ ప్రభుత్వం వ్యాపార సులభతర వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని సూచించింది.