నల్లధనాన్ని తుడిచిపెట్టలేం!
నోట్ల రద్దుపై అసోచామ్ అధ్యయన నివేదిక
• పసిడి, రియల్టీలోకి అక్రమ నిధులను నిరోధించడం సాధ్యంకాదని విశ్లేషణ
• ఆర్థికవ్యవస్థ నుంచి నల్లధనాన్ని వేరుచేసి చూడలేమని అభిప్రాయం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని భవిష్యత్తులో పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదని అసోచామ్ అధ్యయన నివేదిక ఒకటి పేర్కొంది. ‘‘పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థలో ప్రస్తుతం నగదు రూపంలో ఉన్న నల్లధనాన్ని కొంత నిర్మూలించవచ్చు. అయితే పసిడి, రియల్టీ వంటి అసెట్స్‌లోకి మారిన అక్రమ నిధులను మాత్రం తుడిచిపెట్టడం సాధ్యంకాదు’’ అని నివేదిక పేర్కొంది. అయితే ఆస్తి లావాదేవీలపై స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే... రియల్టీకి అక్రమధన ప్రవాహం కొంత తగ్గే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడ్డం గమనార్హం. నివేదిక అంశాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వివరించారు. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ పెద్ద నోట్ల రద్దు అనేది... ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ రూపంలో ఉన్న తక్షణం నల్లధనాన్ని కొంత వరకూ నిరోధించడానికి దోహదపడుతుంది. అయితే భవిష్యత్తులోనూ నల్లధనం నిరోధానికి దోహదపడుతుందని భావించడం సరికాదు.
⇔ భవిష్యత్తులోనూ నల్లధనం నిరోధానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తి లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ తగ్గించడం, రియల్టీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వంటివి ఇందులో ముఖ్యమైనవి.
⇔ రద్దయిన పెద్ద నోట్లలో భారీ మొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ రూపంలో చేరిపోయింది. అది అక్రమమైన సొమ్మా లేక సక్రమమా అన్నది అనవసరం. దీన్నిబట్టి నగదురూపంలోని నలధనాన్నీ పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని అర్థం అవుతోంది.
⇔ పెద్ద నోట్ల రద్దు సమయంలో విభిన్న అకౌంట్ల ద్వారా నల్లధనం డిపాజిట్ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే వనరుల కొరత వల్ల అలాంటి డబ్బును గుర్తించి, ఇందుకు సంబంధించిన నల్లధన కుబేరులపై చర్యలు తీసుకోవడం కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కత్తిమీద సామే.
⇔ ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ చూపకుండా డీమోనిటైజేషన్ అమలు సాధ్యంకాదన్నది సుస్పష్టం.
⇔ అసలు ఆర్థిక వ్యవస్థ (వైట్‌మనీ) నుంచి బ్లాక్‌మనీని మొత్తంగా వేరుచేసి చూడడం చాలా కష్టమైన పని. ఉదాహరణకు వినియోగదారునుంచి తీసుకున్న మొత్తానికి సంబంధించి ఒక షాప్ కీపర్ అమ్మకం పన్ను చెల్లించకపోతే, అతని ఆర్జన మొత్తం నల్లధనంగా మారుతుంది. వినియోగం బాగా పెరిగడం వల్ల జరిగే వస్తు కొనుగోళ్లు... పన్ను సరిగా చెల్లించే వ్యక్తి చేతికి తిరిగి ఆ డబ్బు చేరడంతో తిరిగి అదే డబ్బు సక్రమమైపోతుంది. ఇక్కడ ‘సోర్స్’ వద్దే అక్రమ ఆదాయం, సంపదను నిరోధించడం ముఖ్యం.
⇔ రియల్టీలో అనధికార లావాదేవీలకు ఉన్న అవకాశాలను తగ్గించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ–లావాదేవీలు, స్టాంప్ డ్యూటీలో పారదర్శకత విధానాలను ప్రోత్సహించాలి.
⇔ కొన్ని నిబంధనలను అధికారులు స్వయంగా నిర్దేశించుకుని, ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంది. ఇది నల్లధనం పెరగడానికి దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితి నిరోధానికి చర్యలు తీసుకోవాలి. అధికారుల విచక్షణాధికాలకు కళ్లెం వేయాలి.
⇔ నల్లధనం నిరోధంలో పటిష్ట రాజకీయ సంకల్పం అవసరం. ఎటువంటి లొసుగులూ లేకుండా నిబంధనలు ఉండేలా బ్యూరోక్రాట్స్‌కు నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలి.