అభివృద్ధి ప్రమాణాల్లో తమిళనాడు టాప్
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కాస్త బెటర్
న్యూఢిల్లీ: అభివృద్ధికి సంబంధించిన ప్రధాన కొలమానాల్లో దేశవ్యాప్తంగా తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం ఇలా మొత్తం తొమ్మిది ప్రమాణాల్లో ఎనిమిదింట్లో తమిళనాడు అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఒక్క విద్యలోనే వెనుకబడింది. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాగా, కేరళ రెండో స్థానంలో నిలిచింది.
2009-2011; 2012-2014 కాలంలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఈ ర్యాకింగ్‌లను ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. నాలుగు అంశాల్లో ఉత్తమ పనితీరు చూపుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మూడు ప్రమాణాల్లో ఉత్తర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలవీ..
⇒ ఆదాయం, సమానత్వం విషయంలో చూస్తే... కేరళ, తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు మంచి పనితీరుతో ముందుకెళ్తున్నాయి.
⇒ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కీలకమైన రోడ్లు, విద్యుత్ లభ్యతలో పురోగతి సాధిస్తున్నాయని.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన గమ్యాలుగా నిలిచేందుకు ఇది దోహదం చేసే అంశమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు.
⇒ మొత్తంమీద చూస్తే పనితీరులో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో అసోం, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, జమ్ము-కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.
⇒ పారిశ్రామికాభివృద్ధిలో గుజారాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లు ముందజవేస్తున్నాయి.