న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారపర్వానికి రాజకీయ పార్టీలు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) గురువారం వెల్లడించింది. ర్యాలీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రకటనలకే అందులో 60 శాతానికి పైగా ఖర్చు చేసినట్లు వివరించింది. గత ఎన్నికల ఖర్చుతో పోలిస్తే ఈ మొత్తం 30 నుంచి 40 శాతం ఎక్కువని చెప్పింది. బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే రాజకీయ పార్టీలే అధికంగా ఖర్చు పెట్టినట్లు తెలిపింది. ‘అభ్యర్థులు ఖర్చు చేయడానికి గరిష్ట పరిమితి ఉంది. పార్టీలకు అలాటి నిబంధన లు లేవు. ఎలక్షన్ కమిషన్‌లోని పెద్ద లొసుగు ఇది. దీనిపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్‌రావత్ అన్నారు. ఎన్నికల వల్ల టీవీ చానెళ్లు, వార్తా పేపర్లు, ప్రింటర్లు, సోషల్ మీడియా సైట్లు, వాహన డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్ మొదలైన సంస్థలు లాభపడ్డాయని వివరించారు. ఎన్నికల పుణ్యమా అని ట్విటర్, ఫేస్‌బుక్, గూగుల్‌లు వంటి ఇంటర్‌నెట్ సంస్థలు బాగానే లాభాలు ఆర్జించినట్లు తెలిపారు. కరపత్రాల తయారీ దారులు కూడా బాగానే వెనకేసుకున్నట్లు వివరించారు.