Delhi polls 2015
-
ఎన్నికల ప్రచార ఖర్చు రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారపర్వానికి రాజకీయ పార్టీలు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) గురువారం వెల్లడించింది. ర్యాలీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రకటనలకే అందులో 60 శాతానికి పైగా ఖర్చు చేసినట్లు వివరించింది. గత ఎన్నికల ఖర్చుతో పోలిస్తే ఈ మొత్తం 30 నుంచి 40 శాతం ఎక్కువని చెప్పింది. బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే రాజకీయ పార్టీలే అధికంగా ఖర్చు పెట్టినట్లు తెలిపింది. ‘అభ్యర్థులు ఖర్చు చేయడానికి గరిష్ట పరిమితి ఉంది. పార్టీలకు అలాటి నిబంధన లు లేవు. ఎలక్షన్ కమిషన్‌లోని పెద్ద లొసుగు ఇది. దీనిపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్రావత్ అన్నారు. ఎన్నికల వల్ల టీవీ చానెళ్లు, వార్తా పేపర్లు, ప్రింటర్లు, సోషల్ మీడియా సైట్లు, వాహన డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్ మొదలైన సంస్థలు లాభపడ్డాయని వివరించారు. ఎన్నికల పుణ్యమా అని ట్విటర్, ఫేస్బుక్, గూగుల్‌లు వంటి ఇంటర్నెట్ సంస్థలు బాగానే లాభాలు ఆర్జించినట్లు తెలిపారు. కరపత్రాల తయారీ దారులు కూడా బాగానే వెనకేసుకున్నట్లు వివరించారు. -
విజయం ఆప్‌దే
న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం మాదేనని ఢిల్లీ మాజీ మంత్రి, మంగోల్‌పురి నియోజకవర్గ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పద వికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంగీకరించారు. అయినా వారు పార్టీని మాత్రం వీడలేదని స్పష్టం చేశారు. ప్రజల అండతో శనివారం జరిగే ఎన్నికల్లో ఆప్ సంపుర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆప్‌లో కీలక నేతగా ఉన్న రాఖీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ చౌహాన్‌ను ఓడించారు. 26 ఏళ్లకే కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆమె ప్రజలిచ్చే ఫండ్‌నే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ. 51,150గా నమోదు చేసిన ఆమె ఈసారి రూ. 18,500గా పేర్కొన్నారు. ‘డబ్బు లేకపోవడం నా ముందున్న అతి పెద్ద సవాల్. కానీ నా దగ్గరున్న వాలంటీర్లే కొండంత అండ. నిస్వార్థంగా, పూర్తి అంకిత భావంతో వారు నా తరఫున ప్రచారం చేస్తున్నారు. నాతో కలసి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు..’ అని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పిస్తా మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తానని బిర్లా వెల్లడించారు. నేర రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని చెప్పారు. మురుగునీటి సమస్య నిర్మూలన, మంచినీటి సరఫరా, విద్యుత్ అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ‘మంగోల్‌పురిలో రక్షణ ఉందని మహిళలు భావించడం లేదు. మురుగునీటిని అదుపులో ఉంచడానికి సరైన వ్యవస్థ లేదు. ప్రజలు పెన్షన్ ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. నీరు, కరెంట్ కోతలు వంటి మౌలిక సదుపాయాల కొరత ఉంది. నాకు వచ్చిన నిధులతో నియోజకవ ర్గంలోసోలార్ బల్బులు పెట్టించాను. పార్క్‌ల్లో సీసీటీవీలు అభివృద్ధి చేశాను..’ అని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి, చేయబోయే పనుల గురించి వివరిస్తూ బిర్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
కిరణ్ బేడీ కోసం సీనియర్ నేతల ర్యాలీలు
న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ విజయం కోసం బీజేపీ సీనియర్ నేతలు ప్రచారానికి చివరిరోజైన గురువారం చెమట చిందించారు. కిరణ్‌బేడీ పోటీచేస్తున్న కృష్ణ నగర్ నియోజకవర్గంలో పలు ర్యాలీలు నిర్వహించారు. కాగా ఉత్తర, దక్షిణ ఢిల్లీల్లోని మంగోల్‌పురి, సుల్తాన్‌పురి, కిరారి, నంగోలీ, మున్డ్కా ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో కిరణ్‌బేడీ పాల్గొన్నారు. ఆమె తన చివరి ర్యాలీని కృష్ణ నగర్లో నిర్వహించారు.ఈ ర్యాలీలో ఆమెతోపాటు కేంద్ర మంత్రి, స్థానిక నేత హర్షవర్ధన్, తూర్పుఢిల్లీ లోక్‌సభ సభ్యుడు మహేష్ గిరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన లాయర్లతో బేడీ మాట్లాడుతూ.. బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ నగర్లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తనను దీవించాలని కోరారు. అలాగే తన హయాంలో మంచి పాలనను అందిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, కిరణ్‌బేడీ గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషిచేయాలని స్థానికుడైన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. గతంలో ఇక్కడి నుంచి హర్షవర్ధన్ పలుమార్లు గెలిచిన సంగతి తెలిసిందే.