
గతవారం బిజినెస్
నియామకాలు
అసోచామ్ కొత్త ప్రెసిడెంట్‌గా సందీప్ జాజోడియా నియమితులయ్యారు. ఈయన మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అలాగే వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న బాలక్రిషన్ గోయెంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ చైర్మన్‌గా ఉన్న కిరణ్ కుమార్ గ్రంధి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.17%
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో కేవలం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 జనవరితో (5.69%) పోల్చిచూస్తే... 2017 జనవరిలో రిటైల్ బాస్కెట్ మొత్తం ధర కేవలం 3.17% పెరిగిందన్నమాట. నోట్ల రద్దుతో వినియోగ డిమాండ్ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. 2016 డిసెంబర్‌లో ఈ రేటు 3.41 %
రూ.1.42 లక్షల కోట్ల రిఫండ్స్‌ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 1.62 కోట్ల రిఫండ్స్‌ను జారీ చేసింది. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.42 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే.. ఇది 41.5 శాతం అధికమని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హైరింగ్
ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయ్. ప్రతి ఏడాది ఇన్ఫోసిస్ 20 వేల నుంచి 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 6,000 మందికే ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ ఐటీ విభాగం కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు.
జనవరి–మార్చిలో వృద్ధి 5.7 శాతం
భారత్ ఆర్థికవృద్ధి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 5.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం దీనికి కారణంగా పేర్కొంది. వ్యవస్థలో కరెన్సీ నోట్ల కొరత తీరడం, సంపద పంపిణీ, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ వృద్ధికి దోహదపడే అంశాలని వివరించింది.
నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు జీవీకేదే
నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు ను తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే, జీఎంఆర్‌లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పజెప్పినట్లు సిడ్కో ప్రకటించింది. 2019 డిసెంబర్ నాటికి ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోస్టల్ బ్యాంక్‌కు రూ.500 కోట్ల కేటాయింపు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) సంబంధించి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌ల ఏర్పాటు ఈ బ్యాంక్ లక్ష్యం. కేటాయింపుల్లో రూ.125 కోట్లు మూలధనం కాగా, రూ.375 కోట్లు ’గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. ఇటీవలే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రయోగాత్మకంగా రాయ్‌పూర్, రాంచీల్లో సర్వీసులు ప్రారంభించింది.
30 నెలల గరిష్టానికి టోకు ధరలు
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్ రేటు 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) 1.07 శాతం క్షీణత నమోదయ్యిం ది. కాగా నవంబర్, డిసెంబర్‌లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి.
మళ్లీ సత్తా చాటిన యాపిల్
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మళ్లీ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రారాజుగా అవతరించింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 17.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తన నివేదికలో పేర్కొంది. కాగా శాంసంగ్ 17.8 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 7 శాతం వృద్ధితో 43.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయని పేర్కొంది.
ఐదవ నెలా ఎగుమతులు అప్..!
భారత్ ఎగుమతులు వరుసగా ఐదవ నెలా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. 2016 జనవరితో పోల్చిచూస్తే... 2017 జనవరిలో ఎగుమతులు 4 శాతం పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. విలువ 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతులు ఇదే నెలలో 11 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లు గా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్
రిలయన్స్ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. అలాగే తీవ్రమైన పోటీ కారణంగా పరిశ్రమ 2017–18 అంచనాలను ప్రతికూల స్థితికి సవరించింది.