ఏపీ, తెలంగాణను కేంద్రం అనుసరించాలి
అసోచాం ప్రెసిడెంట్ సందీప్ జజోడియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారానికి అనుకూల విధానాలు అనుసరిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని అసోచామ్ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అనుమతులు, ఆన్‌లైన్ దరఖాస్తు, పన్నుల చెల్లింపు, రిఫండ్స్, క్లియరెన్స్ ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులకు పెనాల్టీల వంటి పద్ధతులను మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా చెప్పారు. అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్, తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగతో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
వరల్డ్ బ్యాంక్ నివేదికతోపాటు అసోచామ్ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాము ఈ ప్రకటన చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యాపార అవకాశాలను ప్రమోట్ చేయడంలో ఈ రెండు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కితాబిచ్చారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రావాల్సిన దానికంటే తక్కువ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికంగా ఉండడం, జఠిలమైన స్థల సేకరణ విధానం, కఠిన నిబంధనలు, బ్యాంకుల అధిక ఎన్‌పీఏలు, మౌలిక వసతుల అడ్డంకులు, నాణ్యమైన మానవ వనరుల తయారీలో వెనుకంజలో ఉండడం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా పరిశ్రమ గాడిలో పడాలంటే వడ్డీ రేట్లు 2 శాతం తగ్గాలని అభిప్రాయపడ్డారు. వడ్డీ, అసలు చెల్లించని ఖాతాలను ఎన్‌పీఏలుగా ప్రకటించే 90 రోజుల పరిమితి నిబంధనను సవరించి 180 రోజులకు చేయాలని కోరారు.