నల్లకుబేరుల పేర్లను వెల్లడించొద్దు: అసోచామ్
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల పేర్లను ప్రభుత్వం అనాలోచితంగా వెల్లడించరాదని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. నల్లకుబేరుల బండారాన్ని బయటపెట్టాలని రాజకీయంగా డిమాండ్లు జోరందుకున్న నేపథ్యంలో అసోచామ్ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలు(డీటీఏటీ) అటు భారతీయ పౌరులకు, కార్పొరేట్లకు చాలా ముఖ్యమని.. దీనివల్ల రెండుసార్లు పన్నులు చెల్లించే పరిస్థితి తప్పుతుందని అసోచామ్ తెలిపింది. ‘ఎలాంటి లెక్కలూ చూపకుండా విదేశాల్లో సొమ్ముదాచుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం వల్ల నల్లధనంపై పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. డీటీఏటీలో ఉల్లంఘనల వల్ల భారత్ విశ్వసనీయత దెబ్బతింటుంది.
ఒకవేళ ప్రభుత్వం వెల్లడించిన వ్యక్తులు, కంపెనీలపై ఆరోపణలు రుజువు కాకపోతే వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లడమేకాకుండా... భారత్‌లోని చట్టాలపైన కూడా నమ్మకం సన్నగిల్లేందుకు దారి తీస్తుంది’ అని అసోచామ్ అభిప్రాయపడింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శక పన్నుల విధానం వంటి వ్యవస్థీకృత మార్పుల ద్వారా ఈ నల్లధనం జాడ్యానికి అడ్డుకట్టవేయొచ్చని పేర్కొంది. నల్లకుబేరులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.. వాళ్ల పేర్లను బయటపెడతామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే.