ఇన్వెస్టర్లు ఇటే చూస్తున్నారు..
♦ వ్యాపార నిర్వహణ పరిస్థితులు మెరుగుపర్చాలి
♦ తెలంగాణ కు అసోచామ్ సూచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ కారణాల రీత్యా మౌలిక ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సరళమయ్యేలా చూడటంపై తెలంగాణ ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. ఇన్వెస్టర్లు ఇటే చూస్తున్న తరుణంలో ఈ చర్యలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది.
2010-15 మధ్య వివిధ రాష్ట్రాల్లోని మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టిన పెట్టుబడుల స్థితిగతుల్ని వివరిస్తూ రూపొందించిన అధ్యయన నివేదికను అసోచామ్ డెరైక్టర్ జనరల్ డీఎస్ రావత్ శుక్రవారమిక్కడ విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2010-2015 మధ్య ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు రూ.32 లక్షల కోట్ల నుంచి రూ.53 లక్షల కోట్లకు ఎగిశాయి. రవాణా సేవల్లో అత్యధికంగా 13 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా రవాణా సేవల రంగం ప్రాజెక్టుల వ్యయాలు సగటున 47 శాతం పెరగ్గా, తెలంగాణలో పెరుగుదల అత్యధికంగా 89 శాతం మేర.. జాప్యం సుమారు 51 నెలల పాటు ఉంటోందని నివేదిక పేర్కొంది.