పని ఒత్తిడితో ఉద్యోగినుల ఆరోగ్యం చిత్తు
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తినీ నెగ్గుకొచ్చే ఒత్తిడిలో మహిళా ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ముగ్గురు దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అస్వస్థతకు గురవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా అసోచామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 42 శాతం మంది వెన్నునొప్పి, స్థూలకాయం, డిప్రెషన్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హృద్రోగాల వంటి వ్యాధులబారిన పడుతున్నారు. మరో 22 శాతం మంది తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యామని 14 శాతం మంది పేర్కొన్నారు.
ఆఫీసుపని, ఇంటిపనితో మహిళలు రెట్టింపు చాకిరీ చేయాల్సి వస్తోంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 11 రంగాలకు చెందిన 120 కంపెనీల్లోని 2,800 మంది మహిళా ఉద్యోగులను ప్రశ్నించామనీ, వీరంతా 32-58 ఏళ్ల వయస్సు వారనీ చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సహా పది నగరాల్లో సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.