
ఆరోగ్య బీమా ప్రీమియం రెండేళ్లలో 32 వేల కోట్లకు
దేశంలో ఆరోగ్య బీమా రంగం మరింత జోరందుకోనుంది. వచ్చే రెండేళ్లలో(2016-17 నాటికి) ఆరోగ్య బీమా ప్రీమియం రూ.32,038 కోట్లకు చేరనుందని పారిశ్రామిక చాంబర్ అసోచామ్ తన అధ్యయన నివేదికలో పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య బీమా రంగం మరింత జోరందుకోనుంది. వచ్చే రెండేళ్లలో(2016-17 నాటికి) ఆరోగ్య బీమా ప్రీమియం రూ.32,038 కోట్లకు చేరనుందని పారిశ్రామిక చాంబర్ అసోచామ్ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. వార్షిక చక్రీయ వృద్ధి రేటు(సీఏజీఆర్) 20 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం మొత్తం రూ.13,092 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ప్రజల ఆదాయాల్లో వృద్ధి, ఆరోగ్య బీమా ప్రీమియంలు కూడా పెరుగుతుండటం దీనికి దోహదం చేయనుందని నివేదిక తెలిపింది. ‘భారత్‌లో తలసరి ఆదాయం, హెల్త్‌కేర్ వ్యయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కొత్త వ్యాధులు, ఆరోగ్యసంబంధ రిస్క్‌లు అధికమవుతుండటం ఇతరత్రా కారణాలు కూడా దేశీయంగా ఆరోగ్య బీమా రంగం వృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయి’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. దేశంలో ఆరోగ్య బీమా కలిగిన వారిలో 65%పైగా ప్రజలకు ప్రైవేటు బీమా కంపెనీలు కవరేజీ అందిస్తుండగా.. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల కవరేజీ వాటా 35 %గా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అయితే, ప్రీమియం విషయంలో మాత్రం 61.5% వాటాతో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు ముందున్నాయి. ప్రైవేటు బీమీ కంపెనీలకు ప్రీమియంలో వాటా 38.5 శాతమే.