
న్యూఢిల్లీ: ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానికి ఇచ్చిన గడువును పొడిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇది అవసరమని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. పీఎన్‌బీ స్కామ్ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సిబ్బంది తమ ప్రధాన వ్యాపారాన్ని కాపాడుకునే క్రమంలో ఉన్నారని, ఆధార్ అనుసంధానం కోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బయటకు రాలేదని, మార్చి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు నిర్వహణ రహితంగా మారిపోయే రూపంలో ఎదురయ్యే మరో సవాలుకు సిద్ధంగా లేదని పేర్కొంది.
ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే, కస్టమర్ల ఖాతాలన్నింటినీ మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానించడం సవాలుతో కూడుకున్నదని, కనుక గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆధార్‌తో అనుసంధాన లక్ష్యాన్ని చేరేకంటే ముందుగానే బ్యాంకులు ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment