కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
గతేడాది డిసెంబర్‌లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్‌నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు.
రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు.
అలా వారి ఖాతాలకు నగదు బదిలీ
ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు.
నిందితుల నుంచి కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్‌ఐఆర్‌లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్‌సీఆర్‌పీ పిటిషన్‌లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment