కమీషన్ల కోసం కక్కుర్తి పడితే.. కటకటాలే
మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులను హెచ్చరిస్తున్న పోలీసులు
నగరంలో ఇటీవల ఇలాంటి ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి కోసం కొందరు చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మీరు ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ. వేల నుంచి లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చని సైబర్ ముఠాల కేటుగాళ్లు అమాయకులకు గాలం వేస్తున్నారు. వారు చెప్పే మాయమాటలు నమ్మి తమ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్‌ను) కమీషన్ల కోసం ఇస్తున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరంలో భాగస్తులవుతారు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అనుమానాస్పద ఖాతాలపై నిఘా
కొన్ని బ్యాంకు ఖాతాల్లో అప్పటివరకు రూ.వందల్లో లావాదేవీలు జరిగి..ఒక్కసారిగా లక్షల రూపాయలు క్రెడిట్, డెబిట్ అవుతున్నాయంటే అది కచ్చితంగా అనుమా నాస్పద ఖాతాగానే గుర్తించాలి. సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఎక్కడా తమ వివరాలు బయటకు పొక్కకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాధితుల సొమ్మును అప్పనంగా కొట్టేసేందుకు, అమాయకులైన ప్రజల బ్యాంకు ఖాతాలనే వాడుకుంటున్నారు. ఇదే తరహా కేసులపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోకస్ పెంచింది. ఎక్కువ ఆర్థిక మోసాల్లో ఆరితేరిన వారు తమ అవసరాలు తీర్చుకునేందుకు కొందరికి కమీషన్లు ఆశచూపి ఇలా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
పూర్తి సాంకేతికతతో ఈ తరహా బ్యాంకు ఖాతాలపై నిఘా పెడుతున్న టెక్నికల్ టీంలు, నిందితుల పూర్తి వివరాలను వెలుగులోకి తెస్తున్నాయి. రాజస్తాన్‌లో చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లోనూ 27 మంది నిందితుల అరెస్టులో సాంకేతికత విశ్లేషణ బృందాలు కీలకంగా పనిచేశాయి.
విదేశాల్లో ఉంటూ ఇక్కడి ఏజెంట్లతో...
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్న ముఠాలపైనా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా కొనసాగుతోంది. గత నెలలోనూ ఇదే తరహాలో ఓ ముఠాను గుర్తించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట ఒకరి నుంచి రూ.5.27 కోట్లు కొల్లగొట్టిన కేసులో టీజీ సీఎస్‌బీ దర్యాప్తులో మ్యూల్ బ్యాంక్ ఖాతాల గుట్టు రట్టయ్యింది.
అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌కు చెందిన కందుకూరి రవీందర్‌రెడ్డి, అత్తాపూర్ నలందనగర్‌కు చెందిన బండ్లమూడి రవి సైబర్ నేరగాళ్లకు కమీషన్ల బేసిస్‌లో బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్ చేస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. నెలకు రూ.5వేల వరకు ఆశజూపి వనస్థలిపురానికి చెందిన రమణమురళికృష్ణ, కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్‌కు చెందిన మాధవరావులతో కలిసి మొత్తం14 కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించినట్టు వెల్లడైంది.
ఒక్కో అకౌంట్‌కు రూ.25 వేల చొప్పున సైబర్ నేరగాళ్ల నుంచి కమీషన్ పొందుతున్న ఈ దళారులు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నట్టు తేలింది.
అత్యాశకు పోయి
తమ బ్యాంకు వివరాలను కమీషన్ల కోసం ఇస్తున్న వారిలో ఎక్కువ మంది తెలిసే ఈ ‘మ్యూల్’దందాలోకి దిగుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. టీజీ సీఎస్‌బీ అధికారులు రాజస్తాన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో గుర్తించిన వారే ఇందుకు నిదర్శనంగా వారు పేర్కొంటున్నారు.
పట్టుబడిన 27 మందిలో ప్రైవేట్ కాంట్రాక్టర్, జిమ్ ట్రైనర్, హోటల్ వ్యాపారి, వస్త్ర వ్యాపారి, డేటాఎంట్రీ వర్కర్, అగర్‌బత్తీల వ్యాపారి, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యవసాయం చేసేవారు సైతం ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ తరహాలో తెలంగాణలోనూ మ్యూల్ బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇస్తున్న వారు పెరుగుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాల్లో వాడిన బ్యాంకు ఖాతాలు ఎవరివి అయితే వారికి కూడా నేరంలో భాగం ఉంటుందన్నది మరవొద్దని వారు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment