న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఇప్పుడు మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. ఎగుమతులు పడిపోవడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకేందుకు దారితీయొచ్చు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది’ అని అసోచామ్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా మొదలుపెట్టిన ఈ రక్షణాత్మక చర్యలతో భారత్‌లో కూడా ఆర్థికపరమైన సెటిమెంట్ తీవ్రంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఒకవేళ భారత్ కూడా దిగుమతులపై ఇలాంటి ప్రతిచర్యలకు దిగితే... ఎగుమతులపై ప్రభావం పడుతుందని, విదేశీ మారకం రేట్లలో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ముప్పునుంచి తప్పించుకోవడం కోసం ఒక నిర్ధిష్ట ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ రక్షణాత్మక చర్యల ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటే.. పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తిరోగమన బాటపడతాయని.. దీనివల్ల డాలరుతో రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రతికూలత తప్పదని అసోచామ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment