పీవోఎస్ మెషీన్ల డిమాండ్ రయ్ రయ్!
♦ 2022కి 310 కోట్ల ట్రాన్సాక్షన్లు
♦ అసోచామ్ నివేదిక
బెంగళూరు: దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాల వినియోగం పెరిగింది. వీటి ద్వారా జరిగే లావాదేవీలూ ఊపందుకున్నాయి. 2016లో 16 లక్షలుగా ఉన్న పీవోఎస్ పరికరాల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 30 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో 76 లక్షలకు చేరొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇది ఆర్‌ఎన్‌సీవోఎస్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘డీమోనిటైజేషన్ తర్వాత పీవోఎస్ లావాదేవీలు చాలా రెట్లు పెరిగాయి.
దేశంలో 2016 నవంబర్ 8కి ముందు వరకు దాదాపు 96 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగేవి. కానీ తర్వాత వీటి శాతం 80కి తగ్గింది’ అని అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. దేశంలో 74 కోట్ల డెబిట్/క్రెడిట్ కార్డులున్నాయని, దీంతో పీవోఎస్ పరికరాల సంఖ్య బాగా పెరిగే అవకాశముందన్నారు. గతేడాది రూ.63,500 కోట్లుగా ఉన్న పీవోఎస్ లావాదేవీల విలువ 2022కి రూ.7.5 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు.