transaction
-
UPI Transactions: 11 నెలల్లో రూ.223 లక్షల కోట్లు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనడానికి ఈ లావాదేవీలు ఓ ఉదాహరణ అనే చెప్పాలి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా.. నేపాల్, భూటాన్, యూఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభమైన యూపీఐ.. మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు తక్షణ నగదు బదిలీలకు మాత్రమే కాకుండా.. వ్యాపార లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటియూపీఐ అనేది భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అక్టోబర్ 2024లోనే రికార్డు స్థాయిలో 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. దీని విలువ మొత్తం రూ.23.49 లక్షల కోట్లు. రాబోయే రోజుల్లో ఈ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది.Driving the #DigitalPayment revolution, UPI achieved 15,547 crore transactions worth Rs. 223 lakh crore from January to November, 2024, showcasing its transformative impact on financial transactions in India.⁰#FinMinYearReview2024⁰#BankingInitiatives⁰#ViksitBharat pic.twitter.com/Bkbag6542k— Ministry of Finance (@FinMinIndia) December 14, 2024 -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
పొరబాటు చేసినా రెండ్రోజుల్లో డబ్బు వాపస్!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సింపుల్‌గా యూపీఐ (UPI) దేశంలో ఒక విప్లవంలా వచ్చింది. లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది. నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్‌తో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడీ లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇలా జరిగితే భయపడాల్సిన పనిలేదు.యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పొరపాటున యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేస్తే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదే వేరువేరు బ్యాంకులు అయితే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు.పొరపాటు జరిగితే చేయాల్సినవి..పొరపాటున పంపిన డబ్బు ఎవరికి చేరిందో ఆ వ్యక్తిని సంప్రదించండి. లావాదేవీ వివరాలను తెలిపి డబ్బును తిరిగి పంపమని అభ్యర్థించవచ్చు.తప్పు యూపీఐ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే యూపీఐ యాప్‌లో కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడండి. లావాదేవీ వివరాలను వారికి ఇవ్వండి.యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు.మీ డబ్బును తిరిగి పొందడానికి, డబ్బు కట్ అయిన బ్యాంకును సంప్రదించండి. మీ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది.యూపీఐ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. -
UPI Transactions: రోజుకు రూ.67,165 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హవా కొనసాగుతోంది. యూపీఐ వేదికగా 2024 జూన్ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. గత నెలలో (1–29 తేదీల మధ్య) రూ.19,47,787 కోట్ల విలువైన 1,342.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో రూ.14,75,464 కోట్ల విలువైన 933 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనినిబట్టి చూస్తే యూపీఐ హవా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో, సురక్షితంగా చెల్లింపులు చేసే వీలుండడం వల్లే యూపీఐ ఈ స్థాయిలో దూసుకుపోతోంది. టెల్కోల దూకుడుతో మారుమూల పల్లెలకూ యూపీఐ యాప్స్ విస్తరించడం విశేషం.598 సంస్థల సేవలుదేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో 598 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు నిమగ్నమయ్యాయి. యూపీఐ యాప్స్‌లో ఫోన్‌పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యూపీఐ వేదికగా ఒక నెలలో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సాధించిన తొలి యాప్‌గా ఫోన్‌పే సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో ఫోన్‌పే ద్వారా ఏకంగా 683 కోట్ల లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.10,33,589 కోట్లు ఉంది. గూగుల్‌పే రూ.7,23,316 కోట్ల విలువైన 522 కోట్ల లావాదేవీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో ఉన్న పేటీఎం యాప్ వేదికగా ఆర్బీఐ ఆంక్షల ప్రభావంతో లావాదేవీలు భారీగా క్షీణించాయి. మే నెలలో పేటీఎం ద్వారా రూ.1,24,705 కోట్ల విలువైన 114 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 జనవరిలో పేటీఎం యాప్‌తో రూ.1,92,615 కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి. -
ఓఎన్డీసీ @50 లక్షల లావాదేవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానించే ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)లో లావాదేవీల సంఖ్య ఈ డిసెంబరు ఆఖరు కల్లా నెలకు 50 లక్షల స్థాయికి చేరనున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఇవి 70 లక్షలకు చేరే అవకాశం ఉందని సంస్థ ఎండీ టి. కోషి తెలిపారు. ఈ ఏడాది తొలినాళ్లలో లావాదేవీలు కొద్ది వేల సంఖ్యలో మాత్రమే ఉండేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఓఎన్డీసీలో దాదాపు 40 యాప్‌లు ఉన్నట్లు వివరించారు. నిత్యావసరాలు, ఫ్యాషన్ మొదలైనవి ఉండగా, వాటితో పాటు కొత్తగా ఆర్థిక సేవలు, ఇతరత్రా సర్వీసులను కూడా ఓఎన్డీసీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోమవారమిక్కడ ఆటో, క్యాబ్ సేవల యాప్ యారీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో వాహన సేవల రంగాన్ని పునర్నిర్వంచేలా తమ యాప్ ఉంటుందని యారీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు హరిప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న యాప్‌లకు భిన్నంగా సున్నా కమీషన్ ప్రాతిపదికన దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. రోజుకు అయిదు ట్రిప్‌లు దాటితే డ్రైవర్లు నామమాత్రంగా రూ. 25 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇందులో ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం చార్జీలు ఉంటాయని, కస్టమర్లు చెల్లించే మొత్తం డబ్బు డ్రైవర్లకు వెడుతుందని హరిప్రసాద్ వివరించారు. హైదరాబాద్‌తో ప్రారంభించి వచ్చే 6 నెలల్లో 4 నగరాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 12,000 పైచిలుకు డ్రైవర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిందని, 20,000 మంది డ్రైవర్లు ఇన్స్టాల్ చేసుకున్నారని పేర్కొన్నారు. హరిప్రసాద్, మదన్ బాలసుబ్రమణియన్, పరితోష్ వర్మ కలిసి యారీని ఏర్పాటు చేశారు. -
కొబ్బరినీళ్లు తాగాలంటే అదే చేయమన్నారు - టాటా సన్స్ చైర్మన్
టెక్నాలజీ పరంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఈ రోజు చిల్లర కొట్టులో ఏదైనా వస్తువు కొనాలన్నా.. పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన వస్తువులు కొనాలన్నా డబ్బు జేబులో ఉండాల్సిన అవసరమే లేదు. అంతా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతోంది. వినియోగదారులు మాత్రమే కాకుండా షాప్ ఓనర్లు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ విధానానికి అలవాటు పడిపోతున్నారు, దీంతో డబ్బు తీసుకోవడానికన్నా ఆన్లైన్ విధానానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ 'ఎన్. చంద్రశేఖరన్' తనకు ఎదురైన ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన షేర్ చేసుకున్నారు. చంద్రశేఖరన్ ఉదయం రన్నింగ్‌కి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలనిపించిందని, అయితే కొట్టు పెట్టుకున్న వ్యక్తి డబ్బు తీసుకునే సమయం లేదని, యూపీఐ చేయమని చెప్పినట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023లో వెల్లడించారు. ఇదీ చదవండి: 'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి! నిజానికి దీన్ని బట్టి చూస్తే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా అభివృద్ధి చెందాయనేది ఇట్టే అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో బహుశా యూపీఐ మాత్రమే వినియోగంలో ఉంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ఆటో డ్రైవర్లు కూడా డిజిటల్ పేమెంట్ విధానానికి అలవాటు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో యుపిఐ చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. డైరెక్ట్ ట్రాన్స్ఫర్: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు పంపించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంకు రోజువారీ లిమిట్ కలిగి ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సక్షన్ కొంత ఆలస్యం అవ్వొచ్చు, కొన్ని సార్లు వెంటనే కూడా పూర్తయిపోవచ్చు. ఇవన్నీ దేశం, కరెన్సీ, బ్యాంక్ రూల్స్ మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నగదు జమచేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ క్రెడిట్ కార్డ్ ఏరియా సెలక్ట్ చేసుకుని, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎంత మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకునేది ఎంటర్ చేయండి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి, మొత్తం ట్రాంసెక్షన్ పూర్తయ్యే వరకు అవసరమైన సమాచారం అందించి పూర్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మరో సులభమైన మార్గం ఫోన్ కాల్స్. మొదట మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి వారు అడిగే వివరాలు తెలియజేయండి. డబ్బు పంపాలన్న విషయం కూడా వారికి తెలపాలి. మీరు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న విషయం ద్రువీకరించి పూర్తి చేసుకోవచ్చు. చెక్కును అందించడం ద్వారా: చెక్ ఇస్యూ చేయడం ద్వారా కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొదటి తీసుకునే లేదా గ్రహీత పేరు దగ్గర 'సెల్ఫ్' అని వ్రాయండి చెక్కుపై రాయాల్సిన మిగిలిన వివరాలను కూడా పూర్తి చేయండి. దగ్గరగా ఉన్న బ్యాంక్ లొకేషన్లో చెక్కును డిపాజిట్ చేయాలి. ఏటీఎమ్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఏటీఎమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ ఎంచుకోవాలి. తరువాత పంపాలనుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగా డబ్బు జమచేయడానికి బ్యాంకులు కొంత చార్జెస్ నిర్ణయిస్థాయి. ఇది కూడా ఒక్కో బ్యాంకుకి ఒక్కోలాగా ఉంటుంది. మొబైల్ యాప్‌లు ఉపయోగించి: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువవ్వడం వల్ల ఏదైనా దాదాపు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. కావున స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి బ్యాలెన్స్‌లను బదిలీ చేయవచ్చు. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ యూజర్లకు మంచి సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యాలెట్ నుంచి క్యూఆర్ కోడ్ సాయంతో ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రకటించింది. అలాగే, ఆన్‌లైన్‌లోనూ యూపీఐ చెల్లింపులను అనుమతించే చోట పేటీఎం వ్యాలెట్ నుంచి చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. కేవైసీ పూర్తి చేసిన వ్యాలెట్ యూజర్లకే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 10 కోట్ల వ్యాలెట్ కస్టమర్లు ఉన్నారు. వివిధ సంస్థల వ్యాలెట్ల మధ్య ఇంటర్ ఆపరేబులిటీకి ఎన్పీసీఐ అవకాశం కల్పించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. -
ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్'.. మీకు తెలుసా?
ప్రస్తుతం ఫోనేపే.. గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత చేతిలో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా మొత్తం ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ ట్రాన్షాక్షన్స్ జరగటానికి తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, ఇందులో కొన్ని సార్లు నెట్వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆన్లైన్ కష్టాలు, నెట్వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్‌లైన్ విధానం కూడా అమలులో ఉంది. ఇది ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా సులభంగా ట్రాన్షాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చు. భారతదేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు UPI సేవలను ప్రాసెస్ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సర్వీస్' ప్రారంభించింది. ఇందులో వినియోగదారుడు చేయవలసిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడం. వినియోగదారుడు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేసిన తరువాత మొబైల్ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఇందులో బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులతోపాటు యుపిఐ పిన్ సెట్ చేయడం / మార్చడం కూడా చేసుకోవచ్చు. *99# USSD కోడ్ ద్వారా యుపిఐ లావాదేవీ ప్రారంభించడం ఎలా? మొదట మీ బ్యాంకు అకౌంట్‌కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. తరువాత మీకు కింద కనిపిస్తున్న మెనూ పాప్ వస్తుంది. సెండ్ మనీ రిక్వెస్ట్ మనీ చెక్ బ్యాలన్స్ మై ప్రొఫైల్ పెండింగ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ యుపిఐ పిన్ ఇందులో మీరు డబ్బు పంపించడానికి సెండ్ మనీ సెలక్ట్ చేసుకుని సెండ్ చేయాలి. తరువాత మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని మళ్ళీ సెండ్ చేయాలి. మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంచుకుంటే రిసీవర్ యుపిఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ చేయండి. మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, సెండ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి. చెల్లింపు కోసం రిమార్క్‌ని ఎంటర్ చేయండి. మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి యుపిఐ పిన్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ మీరు సక్రమంగా పూర్తి చేస్తే మీ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. అంతే కాకుండా.. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99# ఉపయోగించి, సరైన సూచనలను అనుసరించడం ద్వారా UPI సేవలను ఆఫ్‌లైన్‌లోనే నిలిపివేయవచ్చు. ఇవన్నీ చేసేటప్పుడు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
అలర్ట్, ‘గూగుల్ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ఏంటో తెలుసా!
ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. భారత్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్షన్ సెర్చ్’ ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన గూగుల్ 8వ ఎడిషన్‌లో సంస్థ సీఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ అందుబాటులోకి తేనున్న ఫీచర్లను పరిచయం చేశారు. ముఖ్యంగా డాక్టర్ల ప్రిస్కప్షన్‌తో పాటు స్థానిక భాషల్లో సమాచారం,మల్టీ సెర్చ్ ఇలా రకరకాల ఫీచర్లను గురించి పిచ్చాయ్ వివరించారు. దీంతో పాటు గూగుల్ పేలో ఈ సరికొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే ఈవెంట్లో కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో గణనీయ మార్పులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సీడీఎస్ఎల్ సిస్టమ్‌లో మాల్వేర్
న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్వేర్ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్ఎల్ శుక్రవారం వెల్లడించింది. ఇది లావాదేవీల సెటిల్మెంట్లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్కనెక్ట్ చేసినట్లు సీడీఎస్ఎల్ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. -
ఆ విషయంలో ఫోన్‌పే సరికొత్త రికార్డు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే రోజుకు 10 కోట్లకుపైగా లావాదేవీల మార్కును దాటింది. నెలకు 250 కోట్ల లావాదేవీలను పూర్తి చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ఫోన్‌పే వేదికగా ఏటా రూ.59,28,000 కోట్ల విలువ చేసే చెల్లింపులు నమోదవుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ వైపు కస్టమర్లు పెద్ద ఎత్తున మళ్లడమే ఈ స్థాయికి కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,000 పైచిలుకు పిన్‌కోడ్స్ నుంచి ఫోన్‌పేకి వినియోగదారులు ఉన్నారు. యాక్టివ్ యూజర్లు నెలకు 16.5 కోట్ల మంది. నమోదిత యూజర్ల సంఖ్య 37 కోట్లకుపైమాటే. నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారు. 3 కోట్ల ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థ వేదికపైకి వచ్చి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు’ అని ఫోన్‌పే వివరించింది. చదవండి: 1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం -
ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, స్పందించిన గూగుల్ పే
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్ పే తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆఫర్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా... తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్‌లో సర్వీసులు అందిస్తున్నామని స్పష్టం చేసింది. పలు సందర్భాల్లో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే అపోహలు ఉంటున్నాయని, అవి సరికాదని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది.చాలా వ్యాపారాలు.. కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్‌ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్ తెలిపింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో డిజిటల్‌గా ఫిక్స్డ్ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. -
ఖాతా ఉపయోగించడం లేదా..?
స్టేషన్ మహబూబ్‌నగర్: చిట్‌ఫండ్ కంపెనీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చెక్కు వస్తుంది.. ఖాతా ఉంటేనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకేముంది అవసరమున్నా, లేకున్నా అప్పటికప్పుడు బ్యాంకులో ఖాతా తీస్తాం.. ఆ చెక్కును మార్చుకున్నాక ఖాతాతో పని అయిపోతుంది. అసలు ఖాతా ఉందనే విషయాన్ని కూడా చాలా మంది మరిచిపోతుంటారు. ఇలాంటి ఖాతాలు ప్రతీ బ్యాంకులో వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండేళ్లపాటు ఎలాంటి డెబిట్, క్రెడిట్ లావాదేవీలు జరగకపోతే అటువంటి ఖాతాలను ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఇలాంటి ఖాతాల విషయంలో ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.. ఆర్బీఐ మార్గదర్శకాలు.. ⇔ నిర్ణీత కాలంలో లభించే వడ్డీ, బ్యాంకు రుసుంలు కాకుండా ఏడాదిపాటు ఏ ఇతర లావాదేవీలు జరగని ఖాతాలపై వార్షిక సమీక్ష జరపాలి. ⇔ ఖాతాలు ఇన్ఆపరేటివ్గా ఉన్న విషయాన్ని ఖాతాదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తూ అందుకు కారణాలను తెలుసుకోవాలి. ఏ కారణంతోనైనా ఖాతాదారుడు మరో కొత్త ఖాతాను నిర్వహిస్తుంటే పాత ఖాతాలోని నగదు అందులో బదిలీ చేయొచ్చు. ⇔ ఖాతాదారుడికి సమాచారం అందించేందుకు ప్రయత్నించినప్పుడు ఎలాంటి వివరాలు లభించకపోతే సదరు వ్యక్తిని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి. ⇔ వినియోగదారుడు ఖాతా నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలియపరిస్తే ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలకు ఏడాదిపాటు గడువు విధిస్తూ మళ్లీ ఖాతాను వినియోగించాల్సిందిగా సూచించవచ్చు. ⇔ గడువులోపు ఖాతాలను పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్ఆపరేటివ్గా ప్రకటించొచ్చు. ⇔ ఖాతాదారులకు పంపించే ఉత్తరాలు చేరకుండా వెనక్కి వస్తుంటే, చట్టబద్ధ వారసులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఖాతాదారుడి చిరునామా కోసం ప్రయత్నించాలి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా ప్రకటించే విషయంలో ఖాతాదారుడు చేసే డెబిట్, క్రెడిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు జమ చేసే వడ్డీ, వసూలు చేసే సేవా రుసుము లను లెక్కలోకి తీసుకోరు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఖాతాలో జమ అవడం, బీమా పాలసీ ప్రీమియం కోసం ఖాతాలో నుంచి డబ్బు డెబిట్ అవడం లాంటి థర్డ్ పార్టీ లావాదేవీలు సైతం ఖాతాదారుడు జరిపే లావాదేవీలు అవుతాయి. ⇔ మోసపూరిత ఖాతాల విషయంలో బ్యాంకులు నిరంతరం నిఘా ఉంచడం సాధారణం. ఈ నేపథ్యంలో ఖాతాలను వర్గీకరించేటప్పుడు ఖాతాదారుడికి సమాచారం లేకుండా బ్యాంకులు వివరాలను రాబడుతూ ఉంటాయి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాగా ప్రకటించినప్పటికీ సదరు ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యమూ కలగజేయరాదు. అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు పర్యవేక్షించడం వాటి బాధ్యతలో భాగమే. ⇔ భద్రతా చర్యల్లో భాగంగా ఒకవేళ ఖాతాను తాత్కాలికంగా ఇన్ఆపరేటివ్ ప్రకటించినా, ఖాతా వర్గీకరణ ఆధారంగా నియమ నింబంధనల మేరకు ఖాతా కొనసాగింపుకు వీలుంటుంది. ఇలా కొనసాగించే ముందు లావాదేవీ/ఖాతా కచ్చితత్వాన్ని ఖాతాదారుడి వ్యక్తిగత గుర్తింపును నిర్ధా రించి తదుపరి చర్యలుంటాయి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాలను ఉపయోగించేలా చేసేందుకు ఎటువంటి రుసుములు విధించరాదు. ⇔ పొదుపు ఖాతాలను నిర్వహిస్తున్నా, లేకపోయినా అందుకు తగిన వడ్డీ మాత్రం బ్యాంకు తప్పనిసరిగా జమ చేయాలి. ⇔ ఫిక్స్డ్ డిపాజిట్లు విషయంలో మెచ్యూరిటీ తీరిన తర్వాత పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ అమలవుతుంది. ⇔ పదేళ్లకు పైబడిన ఇన్క్లెయిమ్ డిపాజిట్లు, ఇన్ఆపరేటివ్ ఖాతాలకు సంబంధించి వారి పేరు, చిరునామాలను బ్యాంకులు తమ వెబ్సైట్లలో పొందుపర్చాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. ఖాతా సంఖ్య, ఖాతా రకం, బ్రాంచి వంటి వివరాలు వెబ్సైట్లో పెట్టొద్దు. -
పీవోఎస్ మెషీన్ల డిమాండ్ రయ్ రయ్!
♦ 2022కి 310 కోట్ల ట్రాన్సాక్షన్లు ♦ అసోచామ్ నివేదిక బెంగళూరు: దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాల వినియోగం పెరిగింది. వీటి ద్వారా జరిగే లావాదేవీలూ ఊపందుకున్నాయి. 2016లో 16 లక్షలుగా ఉన్న పీవోఎస్ పరికరాల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 30 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో 76 లక్షలకు చేరొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇది ఆర్‌ఎన్‌సీవోఎస్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘డీమోనిటైజేషన్ తర్వాత పీవోఎస్ లావాదేవీలు చాలా రెట్లు పెరిగాయి. దేశంలో 2016 నవంబర్ 8కి ముందు వరకు దాదాపు 96 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగేవి. కానీ తర్వాత వీటి శాతం 80కి తగ్గింది’ అని అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. దేశంలో 74 కోట్ల డెబిట్/క్రెడిట్ కార్డులున్నాయని, దీంతో పీవోఎస్ పరికరాల సంఖ్య బాగా పెరిగే అవకాశముందన్నారు. గతేడాది రూ.63,500 కోట్లుగా ఉన్న పీవోఎస్ లావాదేవీల విలువ 2022కి రూ.7.5 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. -
100లో 85 లావాదేవీలు డిజిటల్లోనే
♦ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే వెల్లడి ♦ తెలంగాణలో 200వ శాఖ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని హెచ్‌డీఎఫ్‌సీలో జరిగే ప్రతి వంద లావాదేవీల్లో 85 డిజిటల్లోనే జరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే చెప్పారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఎన్ని ప్రకటించినా సరే 100 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరపలేమని పేర్కొన్నారు. గురువారమిక్కడ 200వ బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందులో 101 హైదరాబాద్‌లో మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 144 బ్రాంచీలున్నాయని పేర్కొన్నారు. -
వస్తు, సర్వీసు విక్రయాల పట్ల సీబీడీటీ వివరణ
-
రూ. 2 లక్షల నగదును ఒకే లావాదేవీలో పొందితే చెప్పాలి
వస్తు, సర్వీసు విక్రయాల పట్ల సీబీడీటీ వివరణ న్యూఢిల్లీ: వస్తు, సర్వీసుల విక్రయాల్లో రూ. 2 లక్షల నగదు లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయ పన్ను (ఐటీ) విభాగం శుక్రవారం వివరణ ఇచ్చింది. ఒకే లావాదేవీలో నగదు పరిమాణం రూ. 2 లక్షలు మించితే, విక్రయాల ద్వారా నగదు పొందినవారు తమ దృష్టికి తేవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన రిపోర్టింగ్ మార్గదర్శకాలపై వ్యాపార వర్గాల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సీబీడీటీ ఈ వివరణ ఇచ్చింది. దఫదఫాలుగా మొత్తం రూ. 2 లక్షల దాకా జరిగే నగదు లావాదేవీల గురించి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందా లేక ఏకమొత్తంగా ఒకే లావాదేవీలో పరిమాణం రూ. 2 లక్షలు దాటితే ఐటీ విభాగానికి తెలియజేయాలా అన్న అంశంపై కొన్ని వర్గాలు సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా వివరణనిచ్చింది. -
ఆన్లైన్ లావాదేవీలు సులభతరం
- జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): ఆన్లైన్ లావాదేవీలు సులభతరమని, నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. బుధవారం ఎంఈఓలు, బ్యాంకర్లు, డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపకులు, వివిధ వర్గాల వారికి ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యాక్సిస్ పే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ద్వారా సులభంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చేపట్టవచ్చని వివరించారు. నగదు బదిలీ కూడా సెల్‌ఫోన్ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ యనబుల్టీ పేమెంటు సిస్టమ్ ద్వారా ఒక ఆధార్ నుంచి మరో ఆధార్‌కు నగదు, విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్, నగదు బదిలీ వంటి వాటిని చేపట్టవచ్చని వివరించారు. మైక్రో ఏటీఎంల ద్వారా సులభంగా లావాదేవీలు నిర్వహించవచ్చని సూచించారు. ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారాలపై హైస్కూళ్లలో 8,9, 10 తరగతుల విద్యార్థులకు, జూనియర్, డిగ్రీ విద్యార్థులందరికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహరావు, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలను సహకరించండి
- ప్రత్యేక డీసీసీ సమావేశంలో కలెక్టర్ పిలుపు - డిసెంబరు 5లోగా ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు - జన్‌ధన్ ఖాతాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయం కర్నూలు (అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. ఇందుకు సంబంధించి మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల ప్రత్యేక డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,422 చౌకదుకాణాలుండగా, 572 షాపులకు డీలర్లు లేరన్నారు. 1850 షాపులకు మాత్రమే రెగ్యులర్ డీలర్లున్నారని, వీరందరినీ బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. వీరికి ఈ-పాస్ మిషన్లు సరఫరా చేయడంతోపాటు పూర్తిగా సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణ బాధ్యతలను గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తామన్నారు. మెడికల్‌షాపులు, కిరాణం షాపులు, ఎరువులు, ఫెస్టిసైడ్ షాపులకు కూడా ఈ-పాస్ మిషన్లు సరఫరా చేసి నగదు రహిత లావాదేవీలకు సహకరించాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి సమీపంలోని బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జన్‌ధన్ ఖాతాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం, ఖాతాలు లేని వారందరికీ ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు ఇవ్వడం తదితర ప్రక్రియ మొత్తాన్ని డిసెంబరు 5లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా డెబిట్ కార్డులను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను నిర్వహించడంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను ఈ సందర్భంగా బ్యాంకర్లు ప్రస్తావించగా బ్యాంకు నిబంధనలను ఏ విధంగానూ మార్చుకోకుండా ఉన్నంతలోనే డెబిట్ కార్డులను ఉపయోగించేందుకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లున్నప్పటికీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం నియమిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు కరెంటు ఖాతాలను ప్రారంభించి రూ.50 వేలు డిపాజిట్ చేస్తారని, వారికి రూ. 50 వేల కొత్తనోట్లు ఇచ్చి లావాదేవీలకు సహకరించాలని కోరారు. ఈ పక్రియను డీఆర్డీఏ, డ్వామా పీడీలు, జేడీఏ తదితరులు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహరావు, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ ఆర్ఎంలు రమేష్‌కుమార్, గోపాలకృష్ణ, మోహన్, వీసీకే ప్రసాద్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సహకారం నిషేధం
- రద్దయిన నోట్ల మార్పిడి,డిపాజిట్లకు అనుమతి నిరాకరణ - సహకార బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం - ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు – నిలిచిపోయిన రికవరీలు – సమ్మెకు సిద్ధమంటున్న ఉద్యోగులు – జిల్లాకు చేరని రూ.500 నోట్లు కర్నూలు(అగ్రికల్చర్) : ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నోట్లను సహకార బ్యాంకుల్లో మార్పునకు, డిపాజిట్లపై ఈ నెల 14 సాయంత్రం నుంచి రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించింది. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో 1.50 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఇందులో రైతులే 1.15 లక్షలు. రైతులు అత్యధికంగా సభ్యులుగా ఉన్న బ్యాంకు ఇదే. పెద్దనోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిస్థితుల్లో రైతులు నగదు మార్పుడి, పెద్దనోట్ల డిపాజిట్లకు గ్రామీణ రైతులకు ఈ బ్యాంకు ప్రధాన ఆధారం. వీటిపై ఆర్బీఐ నిషేదం విధించడంతో రైతులు అవస్థలు అన్నీ,ఇన్నీకావు. ఈ బ్యాంకులో దాదాపు రూ.350 కోట్ల డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లో నోట్లు మార్పిడి, డిపాజిట్లకు అవకాశం ఉండి కేవలం కేడీసీసీబీపై మాత్రమే నిషేధం విధించడం వల్ల ఖాతాదారులకు దీనిపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. అయితే ఆర్బీఐ తన ఉత్తర్వులను సడలించడపోవడంతో డీసీసీబీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నిరవధిక సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. నిలిచిపోయిన రికవరీ... రద్దయిన నోట్లతోనే బకాయిలు చెల్లించవ్చని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని బ్యాంకుల్లో రికవరీలు పెరిగాయి. జిల్లా సహకారకేంద్ర బ్యాంకులోనూ మొదటి నాలుగైదు రోజులు రికవరీతో పాటు డిపాజిట్లు పోటెత్తాయి. అయితే రిజర్వుబ్యాంకు నిర్ణయం వల్ల ఇటు బ్యాంకు అధికారులకు, అటు రైతులుకు పాలుపోవడం లేదు. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులపై నిషేధం విధించడంతో వీటిలో ఏమి జరుగుతోందనే చర్చకు తెరలేచింది. రోజులు గడుస్తున్నా అర్బీఐ నుంచి స్పందన లేకపోవడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. చాలా మంది రైతులకు వేరే బ్యాంకుల్లో ఖాతాలు లేవు. దీంతో డిపాజిట్లకు ఈ బ్యాంకుపైనే ఆధారపడ్డారు. నోట్ల మార్పిడి కుదింపుతో మరిన్ని ఇబ్బందులు.... నోట్ల మార్పిడిని కుదించడంతో మరిన్ని ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.4000 వరకు నోట్ల మార్పిడికి అవకాశం ఉండింది. దీనిని శుక్రవారం నుంచి రూ.2000కు తగ్గించడంతో రూ. 2వేలు ఎలా సరిపోతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికీ 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. కర్నూలు నగరంలోనే చాల వరకు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. 500 నోట్లు ఎన్నటికి వచ్చేనో.... 500 నోట్లు అందుబాటులోకి వస్తే నగదు కొరత తీరే అవకాశం ఉన్నా తీవ్ర జాప్యం జరుగుతండటంతో నగదు కొరత తీవ్రం అవుతోంది. వంద నోట్లు ఎస్బీఐకి వచ్చినప్పటికీ వాటిని ఇతర బ్యాంకులకు ఇవ్వడం లేదు. ఏపీజీబీ, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులకు ఆర్బీఐ కరెన్సీ చస్ట్‌లు లేవు. సుదూర ప్రాంతాల కరెన్సీ చస్ట్ల నుంచి తెచ్చుకోవాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు వచ్చిన రూ.2000 నోట్ల కట్టలు చాలా వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలాయనే ఆరోపణలున్నాయి. ఆన్లైన్ లావాదేవీలు పెంచేలా చర్యలు... నగదు కొరత తీవ్రం కావడంతో దీనిని ఎదుర్కొనేందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లలో బ్యాంకుల ద్వారా ఈ –పాస్ మిషన్లు ఏర్పాటు చేయడానికి బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. -
బాబోయ్ బ్యాంకు చార్జీలు!
* ప్రతి లావాదేవీకీ వడ్డింపే వడ్డింపు * కనీస నిల్వ నుంచి స్టేట్మెంట్ వరకూ ఇదే తీరు * ఏటీఎం లావాదేవీలు సహా అన్నిటికీ పరిమితులే * టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న ఖర్చు * ఖాతాదారులకు మాత్రం అందని ప్రయోజనం * ఆన్లైన్లో నేరుగా లావాదేవీలు జరుపుకున్నా చార్జీల మోత * ముందే తెలుసుకోకపోతే జేబుకు ప్రమాదమే!! ఖాతాదారులందరికీ బ్యాంకులు పాస్ బుక్కులిచ్చేవి. ప్రతి లావాదేవీనీ ఆ పాస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవి. నగదు కావాలనుకున్నవారు బ్యాంకుకు వచ్చి విత్‌డ్రాయల్ స్లిప్పై రాసి.. డ్రా చేసుకునేవారు. వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయాలంటే... అది కూడా బ్యాంకుకొచ్చి, చెక్కు ఇస్తేనే సాధ్యమయ్యేది. అయితే ఇదంతా గతం. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పాస్‌బుక్‌లు లేవు. విత్‌డ్రాయల్స్ నేరుగా ఏటీఎంలలోనే. నగదు బదిలీ నేరుగా కస్టమరే చేసుకోవచ్చు. నిజమే!! ఖాతాదారులకు దీంతో చాలా మేలు జరిగింది. మరి ఖాతాదారులకేనా? పాస్బుక్లివ్వటం, వాటిని అప్డేట్ చేయటం... మూడు నెలలకోసారి ఇళ్లకు స్టేట్మెంట్లు పంపటం... నగదు బదిలీకి, విత్‌డ్రాయల్స్‌కు సిబ్బంది పని చేయాల్సి రావటం... ఇవన్నీ బ్యాంకులకూ మిగిలినట్టేగా? టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్యాంకులకూ లబ్ధి కలిగినట్లేగా? మరి ఈ సర్వీసులన్నిటికీ ఇంతకు ముందు లేని చార్జీలు ఇపుడెందుకు వేస్తున్నారు? స్టేట్‌మెంటుకు రూ.100, ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకీ రూ.20పైనే, నగదు బదిలీ చేసినా, ఖాతా ఉన్న బ్రాంచి కాకుండా వేరొక బ్రాంచిలో డిపాజిట్ చేసినా ఎందుకు వడ్డిస్తున్నారు? ఇలాగైతే ఖాతాదారులందరినీ డిజిటల్ వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అసలే ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతపై బోలెడన్ని భయాలున్నాయి. దానికి తగ్గట్టే ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మోసపోవటమూ తప్పట్లేదు. ఇన్నిటి మధ్యా బ్యాంకులు కూడా చార్జీలు వడ్డిస్తుంటే ఖాతాదారులేమైపోవాలి? అసలు బ్యాంకులనే కాదు!! డిజిటైజేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రైల్వేల్లాంటివి కూడా కస్టమర్లపై అదనంగా బాదుతున్నాయంటే ఏమనుకోవాలి? వినియోగదారులకు అందని టెక్నాలజీ లాభం బ్యాంకింగ్ టెక్నాలజీ వల్ల ఏమైనా మార్పులొస్తే అవి ఖాతాదారులకు మేలు చేయాలి. కానీ ఏటీఎంలకు ఖాతాదారుల్ని అలవాటు చేయడానికి... బ్యాంకుల్లో జరిపే లావాదేవీలపై చార్జీలు విధించారు. దీంతో అంతా ఏటీఎంలకు అలవాటు పడ్డారు. అంతలో ఏటీఎం లావాదేవీలకూ పరిమితులు పెట్టి... ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైపు మళ్లించారు. సరే కదా అని నెట్ బ్యాంకింగ్ పై ఆధారపడితే... ప్రతి లావాదేవీకీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉన్నారు. అంటే... బ్యాంకులకెళ్లినా, వెళ్లకున్నా పరిమాణంలో తేడా తప్ప మోత మాత్రం తప్పటం లేదు. పెపైచ్చు ప్రతిదానికీ పరిమితులే. గీత దాటితే పెనాల్టీలు కూడా. ఇదీ... చార్జీలు వడ్డిస్తున్న తీరు ప్రతీ నెలా ఖాతాలో బ్యాంకు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ లేకపోతే.. రూ.50 నుంచి మొదలై రూ.600 పైగా పెనాల్టీలు ఉంటున్నాయి. వీటికి మళ్లీ సేవా పన్నులు, సెస్సులు గట్రా అదనం. అందుకే ఆయా బ్యాంకులు నిర్దేశించిన కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఖాతాలో ఉండేలా చూసుకోవటం ఉత్తమం. * ఏటీఎంల వాడకానికి వస్తే... ప్రాంతాన్ని బట్టి (మెట్రోలు, సిటీలు మొదలైనవి) పరిమితులొచ్చేశాయి. చాలా మటుకు సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో మాత్రం నెలకు 3 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయటం మాత్రమే లావాదేవీ అనుకుంటారు చాలా మంది. అదేమీ కాదు. బ్యాలెన్సు ఎంక్వయిరీ చేసినా... మినీ స్టేట్మెంట్ తీసుకున్నా అవి కూడా లావాదేవీలే. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 నుంచి రూ. 20 పైగానే చార్జీలుంటున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకూ ఏటీఎంలో తక్కువ లావాదేవీలు నిర్వహించడమే ఉత్తమం. * నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించినా బాదుడు తప్పదు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకును తీసుకుంటే బేస్ బ్రాంచ్‌లో (ఒక సిటీలోని అన్ని శాఖలు.. క్యాష్ యాక్సెప్టర్ మెషీన్లలో) నెలకు నాలుగు నగదు లావాదేవీలు మాత్రమే ఉచితం. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ అన్నీ కలిసి నాలుగన్న మాట. ఆ తర్వాత ప్రతి రూ.1,000కి అదనంగా రూ. 5 మేర చార్జీ ఉంటుంది. ఇక బేస్ బ్రాంచ్ కాకుండా వేరే నగరంలోని శాఖల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 చొప్పున చార్జీ ఉంటోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ (సెల్ఫ్) లావాదేవీలు ఐదు దాటాయంటే, ఆరో దాన్నుంచి ప్రతీ లావాదేవీకి రూ. 100 చొప్పున చార్జీలుంటున్నాయి. వీటికి పన్నులు అదనం. * పలు బ్యాంకులు డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులకు వార్షికంగా రూ.100 నుంచి నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే ఎలాగూ వాటికి అదనపు ఛార్జీలు తప్పవు. కాకపోతే కొన్ని బ్యాంకులు మీ కార్డు చెల్లుబాటయ్యే గడువు ఇంకా ఉన్నా సరే... కొత్త కార్డులొచ్చాయని, మీ ఫోటో పెట్టుకోవచ్చని... ఇలా రకరకాల స్కీమ్‌లతో వసూళ్లు మొదలెడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. * ఖాతాదారు నుంచి వసూలు చేసుకునే ఏ అవకాశాన్నీ వదలని బ్యాంకులు .. ఆఖరికి ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా విడిచిపెట్టడం లేదు. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపినందుకు ప్రతి మూణ్నెల్లకోసారి రూ.15 పై చిలుకు వసూలు చేస్తున్నాయి. * కొన్ని బ్యాంకుల్లో పాస్‌బుక్కులు అడిగితే తప్ప ఇవ్వటం లేదు. నెట్‌బ్యాంకింగ్ ఉంది కనక మీరు స్టేట్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వీసా వంటి అవసరాల కోసం కొన్ని సంస్థలు బ్యాంకు ముద్ర, అధికారి సంతకం ఉన్న స్టేట్మెంట్లు మాత్రమే అడుగుతున్నాయి. సంతకం అవసరం లేని డిజిటల్ స్టేట్మెంట్లను అంగీకరించటం లేదు. దీంతో స్టేట్మెంట్ కోసం బ్యాంకుకెళితే... అది ఒక పేజీ ఉన్నా సరే రూ.100 చెల్లించాల్సిందే. ఆన్లైన్ అయినా తప్పని మోత... బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల్లో నగదు బదిలీ సర్వీసులు చేసే విధానాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా లావాదేవీలకూ బ్యాంకులు వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. అటు రైల్వే టికెట్ల బుకింగ్‌లు మొదలుకుని ఇటు కరెంటు, వాటర్ బిల్లులు వంటి వాటికి ఆన్లైన్లో కట్టినా అదనపు చార్జీలు తప్పటం లేదు. ఒకవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహిస్తున్నామంటూ.. మరోవైపు ఇలాంటి వడ్డింపులే ంటనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్ కరస్పాండెంట్లు మరీను!! గతంలో ఒకే నగరంలో ఏ శాఖ నుంచైనా తన ఖాతాలో డిపాజిట్ చేసుకునే వీలుండేది. కొన్ని బ్యాంకులిపుడు దీనిక్కూడా చార్జీలు విధిస్తున్నాయి. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఏర్పాటు చే స్తున్న బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) విధానం... కొన్నిచోట్ల మరీ ఘోరం. బిజినెస్ కరస్పాండెంట్లు బ్యాంకు నుంచి కమిషన్ పొందాలి తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. కానీ ప్రతి డిపాజిట్‌కూ కోత తప్పటం లేదు. రూ.5 వేలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.100 కోత వేయటం మరీ విచిత్రం. ఇంకో చిత్రమేంటంటే చాలా బ్యాంకులు తమ శాఖల్లోనే కిందనో... లేక పక్కనో బిజినెస్ కరస్పాండెంట్లను కూర్చోబెడుతున్నాయి. డిపాజిట్ చెయ్యటానికి బ్యాంకుకు వెళితే... పక్కనున్న బీసీ దగ్గర ఖాళీగా ఉంటుంది అక్కడ డిపాజిట్ చేయమని బ్యాంకు సిబ్బందే సలహా ఇస్తున్నారు. తెలియక అక్కడికెళితే... డబ్బులు తీసుకుని నేరుగా డిపాజిట్ చేసేస్తున్నారు. తీరా చూస్తే అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తం తక్కువగా ఉంటోంది. అంటే ఛార్జీల్ని మైనస్ చేస్తున్నారన్న మాట!!. ఏదో బ్యాంకుకు దూరంగా ఏర్పాటు చేస్తే కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుంది గానీ... బ్యాంకుల్లోనే ఏర్పాటు చేయటమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ కూడా నగరాల్లో అయితే సదరు బ్యాంకు శాఖ తనకు 5 కిలోమీటర్ల దూరంలోపు బీసీని పెట్టవచ్చని, పల్లెలు, పట్టణాల్లో అయిలే ఈ దూరం 30 కి.మీ. వరకూ ఉండవచ్చని ఆర్బీఐ చెబుతోంది. కానీ పలు బ్యాంకులు దీనికి తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. -
పాన్.. లేకుంటే పరేషాన్
ట్యాక్స్ టాక్ * ఇక లావాదేవీలకు పాన్ తప్పనిసరి * బ్యాంకు ఖాతా.. డీమ్యాట్ తెరవాలన్నా కూడా * బ్యాంకు లావాదేవీలన్నిటిపై ఐటీ నిఘా నేత్రం కొత్త సంవత్సరం వస్తూనే... కొత్త నిబంధనలు తెచ్చింది. జనవరి 1 నుంచే... పాన్ నంబరు వెల్లడికి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై పలు రకాల లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరి. సుమారు 20కిపైగా లావాదేవీల విషయంలో దీన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం కొన్ని లావాదేవీలకే దీన్ని పరిమితం చేసినా... రానున్న కాలంలో ఆర్థిక లావాదేవీలన్నిటికీ పాన్ నంబరును తప్పనిసరి చేస్తారని చెప్పటానికి దీన్నొక సంకేతంగా భావించొచ్చు. అంతేకాదు! పాన్‌కార్డు వివరాలను పేర్కొనకపోయినా, తప్పుడు వివరాలు అందించినా పెనాల్టీతో పాటు జైలు శిక్షా పడుతుంది. జనవరి 1, 2016 నుంచి ఈ దిగువ పేర్కొన్న లావాదేవీల్లో పాన్ కార్డు వివరాలను పేర్కొనాల్సి ఉంది. బ్యాంకులో డిపాజిట్ చేసేటపుడు రూ.50వేలు దాటితే పాన్ నెంబరును ఇవ్వాలన్న నిబంధన గతంలోనూ ఉంది. అయితే దాన్ని తప్పించుకోవటానికి సురేష్ ఎప్పుడూ రూ.49,999 మాత్రమే డిపాజిట్ చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేసినా పాన్ అవసరం లేదు కనక తన లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి ఉండదన్నది సురేష్ నమ్మకం. ఇప్పటిదాకా సాగినా ఇలాంటివాళ్ల ఆటలిక సాగవు. ఏడాదిలో రూ.5 లక్షలకుపైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారిప్పుడు. అంటే సురేష్ మాదిరి రూ.49,999 చొప్పున 10 సార్లు డిపాజిట్ చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అదే 11వ సారి చేస్తే మాత్రం పాన్ నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు!! ఇకపై మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరి. బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు పాన్ కూడా వివరాలివ్వాలి. ఇక ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్‌కూ పాన్ తప్పనిసరి. అలాగే మీ ఖాతాలో రోజుకు రూ.50,000 మించి నగదు డిపాజిట్ చేసినా... మీ పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. ఒక రోజులో రూ.50,000 మించి డీడీలు, బ్యాంకర్ల చెక్కులు తీసుకున్నప్పుడు కూడా పాన్ ఇవ్వాలి. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ చట్టం ప్రకారం క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీ విలువ రూ.50,000 దాటితే అలాంటి సమయంలో కూడా పాన్ కార్డు వివరాలివ్వాలి. అలాగే క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాన్‌కార్డు ఉండాలి. దీనర్థం ఇక నుంచి మీ ప్రతి బ్యాంక్ లావాదేవీనీ ఆదాయ పన్ను శాఖ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. షేర్ల లావాదేవీల్లో... ఇక నుంచి పాన్‌కార్డ్ ఉంటేనే డీమ్యాట్ ఖాతా తెరవగలరు. అలాగే లక్ష రూపాయలకు మించిన షేర్లు కొన్నపుడు, ఏడాదిలో రూ.50,000 పరిమితి దాటి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నప్పుడు కూడా ఈ వివరాలివ్వాలి. లిస్ట్‌కాని కంపెనీకి సంబంధించిన షేర్లు రూ 1,00,000కు మించి కొన్నా, అమ్మినా వివరాలు ఇవ్వాలి. డిబెంచర్లు, బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే బాండ్లు రూ.50,000 దాటి కొన్నప్పుడు. ఏడాదికి జీవిత బీమా ప్రీమియం రూ.50,000 దాటి చెల్లించినప్పుడు పాన్‌కార్డు వివరాలు పేర్కొనాలి. ఇకపై కొన్ని భారీ వ్యయాలు చేసినప్పుడు పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. అవేంటంటే... * స్థిరాస్తి క్రయవిక్రయ విలువ రూ.10 లక్షలు దాటితే పాన్‌కార్డ్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ కొన్నవారు, అమ్మినవారు ఇద్దరూ కూడా పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ విలువ రూ. 5 లక్షలుండేది. * ప్రతి మోటార్ వాహనం కొనుగోలు సమయంలోనూ పాన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వా లి. దీన్నుంచి ద్విచక్ర వాహన లావాదేవీలను మాత్రం మినహాయించారు. * ఇకపై ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లి రూ. 50,000 మించి బిల్ చేస్తే అప్పుడు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. * రూ. 2,00,000 మించి ఏదైనా బంగారు ఆభరణం కొంటే కూడా పాన్ వివరాలివ్వాలి. ఈ పరిమితిని రూ. 5,00,000 పెంచాలని గోల్డ్ జ్యూయెలరీ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. * బంగారం ఆభరణాలే కాదు! ఇకపై ఏ క్రయవిక్రయమైనా ఆ వ్యవహారం విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ కార్డ్ వివరాలివ్వాలి. * విదేశీ ప్రయాణాల్లో నగదుతో టికెట్లు కొన్నప్పుడు, నగదుతో విదేశీ కరెన్సీ కొన్నప్పుడు కూడా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. దాచేస్తే.. శిక్ష తప్పదు.. ఈ పైన పేర్కొన్న లావాదేవీలన్నింటిలో పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఈ వివరాలివ్వకపోయినా.. తప్పుడు వివరాలిచ్చినా పెనాల్టీతో పాటు 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నా, వేరే వారి పాన్‌కార్డ్ వివరాలు పేర్కొన్నా కూడా శిక్ష తప్పదు. అలాగే పాన్ కార్డు ఉండి వివరాలివ్వకపోయినా దాన్ని నేరంగానే పరిగణిస్తారు. పాన్‌కార్డు అవసరం లేనివారు ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఫారమ్-60 డిక్లరేషన్ ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ ఈ డిక్లరేషన్‌లో ఉన్నది తప్పుడు సమచారం అని తేలితే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 120 కోట్ల దేశ జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 3-4 శాతం లోపే. చాలామంది పన్ను పరిధిలో ఉన్నా, లావాదేవీలను బ్లాక్‌లో నడిపించడం ద్వారా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ బ్లాక్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తూ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్నదే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. తద్వారా వీరినందరినీ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక నుంచి పాన్‌కార్డు వివరాలను సెల్ఫోన్లో సేవ్ చేసుకోవడంతో పాటు, లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా ఒరిజినల్ పాన్‌కార్డ్ ఉండేలా చూసుకోండి. -
వేరబుల్స్‌తో స్మార్ట్‌గా బ్యాంకింగ్
కొంగొత్త టెక్నాలజీలు వస్తున్న కొద్దీ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే విధానాల ముఖచిత్రం మారిపోతోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ వంటివి అందుబాటులోకి రావడంతో ఏ చిన్న లావాదేవీకైనా సెలవు పెట్టుకుని మరీ బ్యాంకుకు వెళ్లాల్సిన అగత్యం చాలా మందికి చాలామటుకు తప్పింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి నెలా సగటున 2.7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. ఈ గణాంకాల నేపథ్యంలో ఖాతాదారుకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి బ్యాంకులు. దీంతో రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వేరబుల్స్‌కి (స్మార్ట్‌వాచీలు మొదలైనవి) ప్రాధాన్యం పెరగనుంది. స్మార్ట్‌వాచీల రాకతో క్రమక్రమంగా బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ ప్యాకెట్లోని ఫోన్ల నుంచి మణికట్టుపైన వాచీల వైపు మళ్లుతోంది. ఈ వేరబుల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు ఆయా సందర్భాలకు తగిన ఆఫర్లను అప్పటికప్పుడు ఖాతాదారులకు తెలియజేసే వీలు కలుగుతుంది. ఉదాహరణకు మీరు ఏదో స్టోర్‌లోకి వెళ్లినప్పుడో లేదా దాని దగ్గరనుంచి వెళుతున్నప్పుడో సదరు స్టోర్‌లో కొనుగోళ్లపై తమ ఖాతాదారులకు అందిస్తున్న పరిమిత కాలపు ప్రమోషనల్ ఆఫర్ సమాచారం మీకు అప్పటికప్పుడు తెలియజేయొచ్చు. అలాగే, మీ బ్యాంకు శాఖ దగ్గర్నుంచి వెళుతుండగా.. ఖాతాల వివరాలు ఇట్టే డిస్ప్లే చేయొచ్చు. ఇలా, నిర్దిష్ట ఖాతాదారుల అవసరాలను బట్టి సర్వీసులైనా.. సమాచారమైనా బ్యాంకులు అందించే వీలవుతుంది. మరెన్నో సర్వీసులు.. ఈ టెక్నాలజీ స్మార్ట్ వాచీలకు మాత్రమే పరిమితం కాదు. స్మార్ట్ ఐవేర్ (కళ్లద్దాలు వంటివి), చేతి కదలికలు మొదలైన సంకేతాలకు అనుగుణంగా స్పందించే పరికరాలు తదితర ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా వేరబుల్స్లోని సెన్సార్ల ద్వారా లభించే మీ దైనందిన కార్యకలాపాల సమాచారం అంతటినీ క్రోడీకరించి (మీ అనుమతితోనే సుమా..), తగిన సర్వీసులు ఏ విధంగా అందించాలన్నదానిపై బ్యాంకులు కసరత్తు సాగించనున్నాయి. ఉదాహరణకు మీరు ఫిట్నెస్ బ్యాండ్ ధరిస్తారనుకుందాం. దీని ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని (నాడి కొట్టుకునే వేగం, నిద్ర అలవాట్లు, రోజువారీ వ్యాయామం, క్యాలరీల వినియోగం మొదలైనవి) క్రోడీకరించి.. వివిధ బీమా సంస్థల భాగస్వామ్యంతో మీకు అనువైన ఇన్సూరెన్స్ పాలసీని చౌక ప్రీమియంతో సిఫార్సు చేయొచ్చు. అలాగే డాక్టర్ అపాయింట్మెంట్లు, వైద్య పరీక్షలు తదితర అంశాలన్నింటికీ సంబంధించి మీకు గుర్తు చేయడం, చెల్లింపులు మొదలైనవి బయోమెట్రిక్ విధానం ద్వారా స్మార్ట్వాచీతోనే పూర్తయ్యేలా కూడా చూడొచ్చు. ఇలా మీ చేతికుండే స్మార్ట్ వాచీ కావొచ్చు.. ఇతరత్రా స్మార్ట్ పరికరాలు కావొచ్చు.. భవిష్యత్ బ్యాంకింగ్‌లో వేరబుల్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే, టెక్నాలజీ పెరిగిపోయినంత మాత్రాన బ్యాంకు శాఖలతో పూర్తిగా పని లేకుండా పోతుందని కాదు. అయితే, లావాదేవీలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో వాటి ప్రాధాన్యతా క్రమం కొంత తగ్గవచ్చు. ఈ టెక్నాలజీలను, కస్టమర్లను అనుసంధానించడం, అధిక విలువ లావాదేవీల నిర్వహణ తదితర కార్యకలాపాల్లో బ్యాంకు శాఖలు కీలక పాత్ర పోషించవచ్చు. భవిష్యత్‌లో చూడబోయే ట్రెండ్స్‌లో ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటివి మరెన్నో రావొచ్చు. వీటిని అందిపుచ్చుకున్న బ్యాంకులే మనగలవని నిస్సందేహంగా చెప్పవచ్చు. - రాజీవ్ ఆనంద్ హెడ్, రిటైల్ బ్యాంకింగ్ యాక్సిస్ బ్యాంక్