యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సింపుల్‌గా యూపీఐ (UPI) దేశంలో ఒక విప్లవంలా వచ్చింది. లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది. నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్‌తో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడీ లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇలా జరిగితే భయపడాల్సిన పనిలేదు.
యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పొరపాటున యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేస్తే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదే వేరువేరు బ్యాంకులు అయితే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు.
పొరపాటు జరిగితే చేయాల్సినవి..
పొరపాటున పంపిన డబ్బు ఎవరికి చేరిందో ఆ వ్యక్తిని సంప్రదించండి. లావాదేవీ వివరాలను తెలిపి డబ్బును తిరిగి పంపమని అభ్యర్థించవచ్చు.
తప్పు యూపీఐ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే యూపీఐ యాప్‌లో కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడండి. లావాదేవీ వివరాలను వారికి ఇవ్వండి.
యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
మీ డబ్బును తిరిగి పొందడానికి, డబ్బు కట్ అయిన బ్యాంకును సంప్రదించండి. మీ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది.
యూపీఐ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
Comments
Please login to add a commentAdd a comment