నగదు రహిత లావాదేవీలను సహకరించండి
నగదు రహిత లావాదేవీలను సహకరించండి
Published Tue, Nov 22 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
- ప్రత్యేక డీసీసీ సమావేశంలో కలెక్టర్ పిలుపు
- డిసెంబరు 5లోగా ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు
- జన్‌ధన్ ఖాతాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయం
కర్నూలు (అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. ఇందుకు సంబంధించి మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల ప్రత్యేక డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,422 చౌకదుకాణాలుండగా, 572 షాపులకు డీలర్లు లేరన్నారు. 1850 షాపులకు మాత్రమే రెగ్యులర్ డీలర్లున్నారని, వీరందరినీ బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. వీరికి ఈ-పాస్ మిషన్లు సరఫరా చేయడంతోపాటు పూర్తిగా సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణ బాధ్యతలను గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తామన్నారు. మెడికల్‌షాపులు, కిరాణం షాపులు, ఎరువులు, ఫెస్టిసైడ్ షాపులకు కూడా ఈ-పాస్ మిషన్లు సరఫరా చేసి నగదు రహిత లావాదేవీలకు సహకరించాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి సమీపంలోని బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జన్‌ధన్ ఖాతాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం, ఖాతాలు లేని వారందరికీ ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు ఇవ్వడం తదితర ప్రక్రియ మొత్తాన్ని డిసెంబరు 5లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా డెబిట్ కార్డులను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను నిర్వహించడంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను ఈ సందర్భంగా బ్యాంకర్లు ప్రస్తావించగా బ్యాంకు నిబంధనలను ఏ విధంగానూ మార్చుకోకుండా ఉన్నంతలోనే డెబిట్ కార్డులను ఉపయోగించేందుకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లున్నప్పటికీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం నియమిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు కరెంటు ఖాతాలను ప్రారంభించి రూ.50 వేలు డిపాజిట్ చేస్తారని, వారికి రూ. 50 వేల కొత్తనోట్లు ఇచ్చి లావాదేవీలకు సహకరించాలని కోరారు. ఈ పక్రియను డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, జేడీఏ తదితరులు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహరావు, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ ఆర్‌ఎంలు రమేష్‌కుమార్, గోపాలకృష్ణ, మోహన్, వీసీకే ప్రసాద్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Advertisement