సహకారం నిషేధం
సహకారం నిషేధం
Published Fri, Nov 18 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
- రద్దయిన నోట్ల మార్పిడి,డిపాజిట్లకు అనుమతి నిరాకరణ
- సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
- ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు
– నిలిచిపోయిన రికవరీలు
– సమ్మెకు సిద్ధమంటున్న ఉద్యోగులు
– జిల్లాకు చేరని రూ.500 నోట్లు
కర్నూలు(అగ్రికల్చర్) : ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నోట్లను సహకార బ్యాంకుల్లో మార్పునకు, డిపాజిట్లపై ఈ నెల 14 సాయంత్రం నుంచి రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించింది. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో 1.50 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఇందులో రైతులే 1.15 లక్షలు. రైతులు అత్యధికంగా సభ్యులుగా ఉన్న బ్యాంకు ఇదే. పెద్దనోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిస్థితుల్లో రైతులు నగదు మార్పుడి, పెద్దనోట్ల డిపాజిట్‌లకు గ్రామీణ రైతులకు ఈ బ్యాంకు ప్రధాన ఆధారం. వీటిపై ఆర్‌బీఐ నిషేదం విధించడంతో రైతులు అవస్థలు అన్నీ,ఇన్నీకావు. ఈ బ్యాంకులో దాదాపు రూ.350 కోట్ల డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లో నోట్లు మార్పిడి, డిపాజిట్లకు అవకాశం ఉండి కేవలం కేడీసీసీబీపై మాత్రమే నిషేధం విధించడం వల్ల ఖాతాదారులకు దీనిపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. అయితే ఆర్‌బీఐ తన ఉత్తర్వులను సడలించడపోవడంతో డీసీసీబీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నిరవధిక సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు.
నిలిచిపోయిన రికవరీ...
రద్దయిన నోట్లతోనే బకాయిలు చెల్లించవ్చని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని బ్యాంకుల్లో రికవరీలు పెరిగాయి. జిల్లా సహకారకేంద్ర బ్యాంకులోనూ మొదటి నాలుగైదు రోజులు రికవరీతో పాటు డిపాజిట్లు పోటెత్తాయి. అయితే రిజర్వుబ్యాంకు నిర్ణయం వల్ల ఇటు బ్యాంకు అధికారులకు, అటు రైతులుకు పాలుపోవడం లేదు. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులపై నిషేధం విధించడంతో వీటిలో ఏమి జరుగుతోందనే చర్చకు తెరలేచింది. రోజులు గడుస్తున్నా అర్‌బీఐ నుంచి స్పందన లేకపోవడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. చాలా మంది రైతులకు వేరే బ్యాంకుల్లో ఖాతాలు లేవు. దీంతో డిపాజిట్లకు ఈ బ్యాంకుపైనే ఆధారపడ్డారు.
నోట్ల మార్పిడి కుదింపుతో మరిన్ని ఇబ్బందులు....
నోట్ల మార్పిడిని కుదించడంతో మరిన్ని ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.4000 వరకు నోట్ల మార్పిడికి అవకాశం ఉండింది. దీనిని శుక్రవారం నుంచి రూ.2000కు తగ్గించడంతో రూ. 2వేలు ఎలా సరిపోతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికీ 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. కర్నూలు నగరంలోనే చాల వరకు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.
500 నోట్లు ఎన్నటికి వచ్చేనో....
500 నోట్లు అందుబాటులోకి వస్తే నగదు కొరత తీరే అవకాశం ఉన్నా తీవ్ర జాప్యం జరుగుతండటంతో నగదు కొరత తీవ్రం అవుతోంది. వంద నోట్లు ఎస్‌బీఐకి వచ్చినప్పటికీ వాటిని ఇతర బ్యాంకులకు ఇవ్వడం లేదు. ఏపీజీబీ, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులకు ఆర్‌బీఐ కరెన్సీ చస్ట్‌లు లేవు. సుదూర ప్రాంతాల కరెన్సీ చస్ట్‌ల నుంచి తెచ్చుకోవాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు వచ్చిన రూ.2000 నోట్ల కట్టలు చాలా వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలాయనే ఆరోపణలున్నాయి.
ఆన్‌లైన్ లావాదేవీలు పెంచేలా చర్యలు...
నగదు కొరత తీవ్రం కావడంతో దీనిని ఎదుర్కొనేందుకు ఆన్‌లైన్ ట్రాన్సాక‌్షన్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లలో బ్యాంకుల ద్వారా ఈ –పాస్ మిషన్‌లు ఏర్పాటు చేయడానికి బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement