హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) హవా కొనసాగుతోంది. యూపీఐ వేదికగా 2024 జూన్ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. గత నెలలో (1–29 తేదీల మధ్య) రూ.19,47,787 కోట్ల విలువైన 1,342.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో రూ.14,75,464 కోట్ల విలువైన 933 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనినిబట్టి చూస్తే యూపీఐ హవా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో, సురక్షితంగా చెల్లింపులు చేసే వీలుండడం వల్లే యూపీఐ ఈ స్థాయిలో దూసుకుపోతోంది. టెల్కోల దూకుడుతో మారుమూల పల్లెలకూ యూపీఐ యాప్స్ విస్తరించడం విశేషం.
598 సంస్థల సేవలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో 598 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు నిమగ్నమయ్యాయి. యూపీఐ యాప్స్‌లో ఫోన్‌పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యూపీఐ వేదికగా ఒక నెలలో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సాధించిన తొలి యాప్‌గా ఫోన్‌పే సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో ఫోన్‌పే ద్వారా ఏకంగా 683 కోట్ల లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.10,33,589 కోట్లు ఉంది. గూగుల్‌పే రూ.7,23,316 కోట్ల విలువైన 522 కోట్ల లావాదేవీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో ఉన్న పేటీఎం యాప్ వేదికగా ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావంతో లావాదేవీలు భారీగా క్షీణించాయి. మే నెలలో పేటీఎం ద్వారా రూ.1,24,705 కోట్ల విలువైన 114 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 జనవరిలో పేటీఎం యాప్‌తో రూ.1,92,615 కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment