రూ. 2 లక్షల నగదును ఒకే లావాదేవీలో పొందితే చెప్పాలి
వస్తు, సర్వీసు విక్రయాల పట్ల సీబీడీటీ వివరణ
న్యూఢిల్లీ: వస్తు, సర్వీసుల విక్రయాల్లో రూ. 2 లక్షల నగదు లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయ పన్ను (ఐటీ) విభాగం శుక్రవారం వివరణ ఇచ్చింది. ఒకే లావాదేవీలో నగదు పరిమాణం రూ. 2 లక్షలు మించితే, విక్రయాల ద్వారా నగదు పొందినవారు తమ దృష్టికి తేవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన రిపోర్టింగ్ మార్గదర్శకాలపై వ్యాపార వర్గాల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సీబీడీటీ ఈ వివరణ ఇచ్చింది. దఫదఫాలుగా మొత్తం రూ. 2 లక్షల దాకా జరిగే నగదు లావాదేవీల గురించి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందా లేక ఏకమొత్తంగా ఒకే లావాదేవీలో పరిమాణం రూ. 2 లక్షలు దాటితే ఐటీ విభాగానికి తెలియజేయాలా అన్న అంశంపై కొన్ని వర్గాలు సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా వివరణనిచ్చింది.