పాన్ లావాదేవీలపై డేగకన్ను!
త్వరలో ఐటీ కొత్త సాఫ్ట్‌వేర్
* నల్లధనానికి అడ్డుకట్టే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) లావాదేవీలను మరింత సులభతరంగా శోధించడానికి ప్రభుత్వం ఒక కొత్త ఐటీ సాఫ్ట్‌వేర్ ఆవిష్కరించనుంది. నల్లధనం కట్టడి లక్ష్యంగా ఈ ప్రొడక్ట్‌ను ఆవిష్కరిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆదాయపు పన్ను బిజినెస్ అప్లికేషన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (ఐటీబీఏ-పీఏఎన్)గా ఈ ప్రొడక్ట్‌ను పిలవనున్నట్లు సమాచారం.
ఈ తాజా డిజిటల్, స్మార్ట్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ నిపుణుల తుది పరీక్షల్లో ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరుకల్లా ఈ ప్రాజెక్ట్‌ను ఆర్థికమంత్రిత్వశాఖ ప్రారంభించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ, ఈ శాఖకు అనుసంధానంగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్‌ఎల్‌లు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తాయి. తాజా పాన్ నంబర్ల కేటాయింపు, 48 గంటల్లో జారీ వంటి ప్రయోజనాలు సైతం తాజా ప్రాజెక్ట్ ద్వారా ఒనగూరనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతున్న సంగతి తెలిసిందే.
తేలిగ్గా... డేటా విశ్లేషణ
ప్రతిపాదిత వ్యవస్థ అమల్లోకి వస్తే... పాన్‌కు సంబంధించి గణాంకాల విశ్లేషణ మరింత సులభతరం అవుతుందని, ఒక పరిమితికి మించి నగదు లావాదేవీలను గుర్తించడం తేలికవుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వ్యవస్థలో ఉన్న నకిలీ పాన్ గుర్తింపు కూడా అధికారులకు సరళతరం అవుతుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు సేవలు అందించడం సైతం సులభతరం కానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఒకవేళ పన్ను చెల్లింపుదారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయినా... సంబంధిత సమాచారాన్ని కంప్యూటర్ ఆధారితంగా తేలిగ్గా అధికారులకు తెలియజేయడానికి తాజా వ్యవస్థ వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడంతోసహా పలు కీలక ఆర్థిక లావాదేవీల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక గుర్తింపునిచ్చే 10 అంకెల ఆల్ఫాన్యూమరికల్ పాన్ కార్డ్ ప్రాముఖ్యత తెలిసిందే.