Permanent Account Number
-
అలా అయితే... పాన్‌కు తండ్రి పేరు అక్కర్లేదు
న్యూఢిల్లీ: పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తల్లే సింగిల్ పేరెంట్ అయితే, సంబంధిత వ్యక్తి పాన్ దరఖాస్తులో తండ్రిపేరు అక్కర్లేదు. ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సవరణలకు అనుగుణంగా దరఖాస్తులో మార్పూ ఉంటుంది. దరఖాస్తుదారుడు తల్లిపేరు మాత్రమే సమర్పించడానికి ఈ తాజా దరఖాస్తు వీలు కల్పిస్తుంది. తాజా నిబంధన డిసెంబర్ 5వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం పాన్ జారీకి తండ్రి పేరు సమర్పించడం తప్పనిసరి. కొన్ని వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వార్షికంగా రూ.2.5 లక్షలు ఆపైన ఆర్థిక లావాదేవీలు కలిగినవారు తప్పనిసరిగా పాన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. -
కార్పొరేట్ ఫైలింగ్స్‌కూ ఆధార్ తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం యోచన న్యూఢిల్లీ: నకిలీ సంస్థల ఏరివేత దిశగా కంపెనీల్లోని కీలక వ్యక్తులు, డైరెక్టర్లు సమర్పించే ఫైలింగ్స్‌కు ఆధార్ నంబరును జతపర్చడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డొల్ల కంపెనీల ద్వారా జరిగే మనీలాండరింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీయంగా తొమ్మిది లక్షల పైచిలుకు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సాధారణంగా కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం రిజిస్టరయిన సంస్థలు.. ఎంసీఏ21 పోర్టల్ ద్వారా ఫైలింగ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంసీఏ21 సంబంధ వివిధ సర్వీసులకు ఆధార్‌ను అనుసంధానం చేసే అంశాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోంది. ఆయా వర్గాలు ఇందుకు అనుగుణంగా ఆధార్ నంబరును సాధ్యమైనంత త్వరగా పొందాల్సిందిగా ఒక నోటీసులో సూచించింది. పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) సమాచారంతో ఆధార్ సమాచారం సరిపోలి ఉండాలని పేర్కొంది. ఇది అమల్లోకి వస్తే ఇకపై ఎంసీఏ21 సర్వీసులన్నీ కూడా ఆధార్ ఆధారితమైనవిగానే ఉంటాయని వివరించింది. -
పాన్ లావాదేవీలపై డేగకన్ను!
త్వరలో ఐటీ కొత్త సాఫ్ట్వేర్ * నల్లధనానికి అడ్డుకట్టే ప్రధాన లక్ష్యం న్యూఢిల్లీ: పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) లావాదేవీలను మరింత సులభతరంగా శోధించడానికి ప్రభుత్వం ఒక కొత్త ఐటీ సాఫ్ట్వేర్ ఆవిష్కరించనుంది. నల్లధనం కట్టడి లక్ష్యంగా ఈ ప్రొడక్ట్‌ను ఆవిష్కరిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆదాయపు పన్ను బిజినెస్ అప్లికేషన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (ఐటీబీఏ-పీఏఎన్)గా ఈ ప్రొడక్ట్‌ను పిలవనున్నట్లు సమాచారం. ఈ తాజా డిజిటల్, స్మార్ట్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ నిపుణుల తుది పరీక్షల్లో ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరుకల్లా ఈ ప్రాజెక్ట్‌ను ఆర్థికమంత్రిత్వశాఖ ప్రారంభించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ, ఈ శాఖకు అనుసంధానంగా ఉన్న ఎన్ఎస్డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తాయి. తాజా పాన్ నంబర్ల కేటాయింపు, 48 గంటల్లో జారీ వంటి ప్రయోజనాలు సైతం తాజా ప్రాజెక్ట్ ద్వారా ఒనగూరనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతున్న సంగతి తెలిసిందే. తేలిగ్గా... డేటా విశ్లేషణ ప్రతిపాదిత వ్యవస్థ అమల్లోకి వస్తే... పాన్‌కు సంబంధించి గణాంకాల విశ్లేషణ మరింత సులభతరం అవుతుందని, ఒక పరిమితికి మించి నగదు లావాదేవీలను గుర్తించడం తేలికవుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వ్యవస్థలో ఉన్న నకిలీ పాన్ గుర్తింపు కూడా అధికారులకు సరళతరం అవుతుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు సేవలు అందించడం సైతం సులభతరం కానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయినా... సంబంధిత సమాచారాన్ని కంప్యూటర్ ఆధారితంగా తేలిగ్గా అధికారులకు తెలియజేయడానికి తాజా వ్యవస్థ వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడంతోసహా పలు కీలక ఆర్థిక లావాదేవీల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక గుర్తింపునిచ్చే 10 అంకెల ఆల్ఫాన్యూమరికల్ పాన్ కార్డ్ ప్రాముఖ్యత తెలిసిందే. -
ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నంబర్ (పాన్) నిబంధనలను కేంద్ర ఆర్థిక శాఖ కఠినతరం చేసింది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలోనే ఒరిజినల్ పత్రాలు కూడా పరిశీలిస్తారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ చెప్పిన మరిన్ని వివరాలు.. దరఖాస్తు చేసే సమయంలో వయసు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు గుర్తింపు కార్డును పాన్ కేంద్రాలకు తీసుకురావాలి. దరఖాస్తుతో పాటు సమర్పించిన జిరాక్సు కాపీలతో ఒరిజినల్ పత్రాలను పరిశీలించి అక్కడికక్కడే వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు. ఈ మార్పు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా, పాన్ కార్డు పొందడానికి ఆయా కేంద్రాల్లో 85 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ కలిపి నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.