కార్పొరేట్ ఫైలింగ్స్‌కూ ఆధార్ తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ: నకిలీ సంస్థల ఏరివేత దిశగా కంపెనీల్లోని కీలక వ్యక్తులు, డైరెక్టర్లు సమర్పించే ఫైలింగ్స్‌కు ఆధార్ నంబరును జతపర్చడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డొల్ల కంపెనీల ద్వారా జరిగే మనీలాండరింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీయంగా తొమ్మిది లక్షల పైచిలుకు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
సాధారణంగా కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం రిజిస్టరయిన సంస్థలు.. ఎంసీఏ21 పోర్టల్ ద్వారా ఫైలింగ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంసీఏ21 సంబంధ వివిధ సర్వీసులకు ఆధార్‌ను అనుసంధానం చేసే అంశాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోంది. ఆయా వర్గాలు ఇందుకు అనుగుణంగా ఆధార్ నంబరును సాధ్యమైనంత త్వరగా పొందాల్సిందిగా ఒక నోటీసులో సూచించింది. పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) సమాచారంతో ఆధార్ సమాచారం సరిపోలి ఉండాలని పేర్కొంది. ఇది అమల్లోకి వస్తే ఇకపై ఎంసీఏ21 సర్వీసులన్నీ కూడా ఆధార్ ఆధారితమైనవిగానే ఉంటాయని వివరించింది.