ఖాతా ఉపయోగించడం లేదా..? | Do you know this about your inoperative bank accounts? | Sakshi
Sakshi News home page

ఖాతా ఉపయోగించడం లేదా..?

Published Wed, Nov 15 2017 8:43 AM | Last Updated on Wed, Nov 15 2017 8:43 AM

Do you know this about your inoperative bank accounts? - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: చిట్‌ఫండ్‌ కంపెనీ లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి చెక్కు వస్తుంది.. ఖాతా ఉంటేనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకేముంది అవసరమున్నా, లేకున్నా అప్పటికప్పుడు బ్యాంకులో ఖాతా తీస్తాం.. ఆ చెక్కును మార్చుకున్నాక ఖాతాతో పని అయిపోతుంది. అసలు ఖాతా ఉందనే విషయాన్ని కూడా చాలా మంది మరిచిపోతుంటారు. ఇలాంటి ఖాతాలు ప్రతీ బ్యాంకులో వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రెండేళ్లపాటు ఎలాంటి డెబిట్, క్రెడిట్‌ లావాదేవీలు జరగకపోతే అటువంటి ఖాతాలను ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఇలాంటి ఖాతాల విషయంలో ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం..

ఆర్‌బీఐ మార్గదర్శకాలు..
నిర్ణీత కాలంలో లభించే వడ్డీ, బ్యాంకు రుసుంలు కాకుండా ఏడాదిపాటు ఏ ఇతర లావాదేవీలు జరగని ఖాతాలపై వార్షిక సమీక్ష జరపాలి.  
ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న విషయాన్ని ఖాతాదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తూ అందుకు కారణాలను తెలుసుకోవాలి. ఏ కారణంతోనైనా ఖాతాదారుడు మరో కొత్త ఖాతాను నిర్వహిస్తుంటే పాత ఖాతాలోని నగదు అందులో బదిలీ చేయొచ్చు.
ఖాతాదారుడికి సమాచారం అందించేందుకు ప్రయత్నించినప్పుడు ఎలాంటి వివరాలు లభించకపోతే సదరు వ్యక్తిని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి.
వినియోగదారుడు ఖాతా నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలియపరిస్తే ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలకు ఏడాదిపాటు గడువు విధిస్తూ మళ్లీ ఖాతాను వినియోగించాల్సిందిగా సూచించవచ్చు.  
గడువులోపు ఖాతాలను పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్‌ఆపరేటివ్‌గా ప్రకటించొచ్చు.
ఖాతాదారులకు పంపించే ఉత్తరాలు చేరకుండా వెనక్కి వస్తుంటే, చట్టబద్ధ వారసులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఖాతాదారుడి చిరునామా కోసం ప్రయత్నించాలి.  
ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా ప్రకటించే విషయంలో ఖాతాదారుడు చేసే డెబిట్, క్రెడిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు జమ చేసే వడ్డీ, వసూలు చేసే సేవా రుసుము లను లెక్కలోకి తీసుకోరు. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ ఖాతాలో జమ అవడం, బీమా పాలసీ ప్రీమియం కోసం ఖాతాలో నుంచి డబ్బు డెబిట్‌ అవడం లాంటి థర్డ్‌ పార్టీ లావాదేవీలు సైతం ఖాతాదారుడు జరిపే లావాదేవీలు అవుతాయి.  
మోసపూరిత ఖాతాల విషయంలో బ్యాంకులు నిరంతరం నిఘా ఉంచడం సాధారణం. ఈ నేపథ్యంలో ఖాతాలను వర్గీకరించేటప్పుడు ఖాతాదారుడికి సమాచారం లేకుండా బ్యాంకులు వివరాలను రాబడుతూ ఉంటాయి.
ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాగా ప్రకటించినప్పటికీ సదరు ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యమూ కలగజేయరాదు. అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు పర్యవేక్షించడం వాటి బాధ్యతలో భాగమే.
భద్రతా చర్యల్లో భాగంగా ఒకవేళ ఖాతాను తాత్కాలికంగా ఇన్‌ఆపరేటివ్‌ ప్రకటించినా, ఖాతా వర్గీకరణ ఆధారంగా నియమ నింబంధనల మేరకు ఖాతా కొనసాగింపుకు వీలుంటుంది. ఇలా కొనసాగించే ముందు లావాదేవీ/ఖాతా కచ్చితత్వాన్ని ఖాతాదారుడి వ్యక్తిగత గుర్తింపును నిర్ధా రించి తదుపరి చర్యలుంటాయి.
ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలను ఉపయోగించేలా చేసేందుకు ఎటువంటి రుసుములు విధించరాదు.  
పొదుపు ఖాతాలను నిర్వహిస్తున్నా, లేకపోయినా అందుకు తగిన వడ్డీ మాత్రం బ్యాంకు తప్పనిసరిగా జమ చేయాలి.  
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు విషయంలో మెచ్యూరిటీ తీరిన తర్వాత పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ అమలవుతుంది.  
పదేళ్లకు పైబడిన ఇన్‌క్లెయిమ్‌ డిపాజిట్లు, ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలకు సంబంధించి వారి పేరు, చిరునామాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో పొందుపర్చాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది. ఖాతా సంఖ్య, ఖాతా రకం, బ్రాంచి వంటి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టొద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement