పాన్.. లేకుంటే పరేషాన్ | New PAN rule comes into effect from January 1 | Sakshi
Sakshi News home page

పాన్.. లేకుంటే పరేషాన్

Published Mon, Jan 4 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

పాన్.. లేకుంటే పరేషాన్

పాన్.. లేకుంటే పరేషాన్

ట్యాక్స్ టాక్
* ఇక లావాదేవీలకు పాన్ తప్పనిసరి
* బ్యాంకు ఖాతా.. డీమ్యాట్ తెరవాలన్నా కూడా
* బ్యాంకు లావాదేవీలన్నిటిపై ఐటీ నిఘా నేత్రం

 
కొత్త సంవత్సరం వస్తూనే... కొత్త నిబంధనలు తెచ్చింది. జనవరి 1 నుంచే... పాన్ నంబరు వెల్లడికి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై పలు రకాల లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరి.

సుమారు 20కిపైగా లావాదేవీల విషయంలో దీన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం కొన్ని లావాదేవీలకే దీన్ని పరిమితం చేసినా... రానున్న కాలంలో ఆర్థిక లావాదేవీలన్నిటికీ పాన్ నంబరును తప్పనిసరి చేస్తారని చెప్పటానికి దీన్నొక సంకేతంగా భావించొచ్చు. అంతేకాదు! పాన్‌కార్డు వివరాలను పేర్కొనకపోయినా, తప్పుడు వివరాలు అందించినా పెనాల్టీతో పాటు జైలు శిక్షా పడుతుంది. జనవరి 1, 2016 నుంచి ఈ దిగువ పేర్కొన్న లావాదేవీల్లో పాన్ కార్డు వివరాలను పేర్కొనాల్సి ఉంది.
 
బ్యాంకులో డిపాజిట్ చేసేటపుడు రూ.50వేలు దాటితే పాన్ నెంబరును ఇవ్వాలన్న నిబంధన గతంలోనూ ఉంది. అయితే దాన్ని తప్పించుకోవటానికి సురేష్ ఎప్పుడూ రూ.49,999 మాత్రమే డిపాజిట్ చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేసినా పాన్ అవసరం లేదు కనక తన లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి ఉండదన్నది సురేష్ నమ్మకం. ఇప్పటిదాకా సాగినా ఇలాంటివాళ్ల ఆటలిక సాగవు.

ఏడాదిలో రూ.5 లక్షలకుపైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారిప్పుడు. అంటే సురేష్ మాదిరి రూ.49,999 చొప్పున 10 సార్లు డిపాజిట్ చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అదే 11వ సారి చేస్తే మాత్రం పాన్ నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు!! ఇకపై మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరి. బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినప్పుడు పాన్ కూడా వివరాలివ్వాలి. ఇక ప్రతి ఫిక్స్‌డ్ డిపాజిట్‌కూ పాన్ తప్పనిసరి. అలాగే మీ ఖాతాలో రోజుకు రూ.50,000 మించి నగదు డిపాజిట్ చేసినా... మీ పాన్ వివరాలు ఇవ్వాల్సిందే.

ఒక రోజులో రూ.50,000 మించి డీడీలు, బ్యాంకర్ల చెక్కులు తీసుకున్నప్పుడు కూడా పాన్ ఇవ్వాలి. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ చట్టం ప్రకారం క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీ విలువ రూ.50,000 దాటితే అలాంటి సమయంలో కూడా పాన్ కార్డు వివరాలివ్వాలి. అలాగే క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాన్‌కార్డు ఉండాలి. దీనర్థం ఇక నుంచి మీ ప్రతి బ్యాంక్ లావాదేవీనీ ఆదాయ పన్ను శాఖ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది.
 
షేర్ల లావాదేవీల్లో...
ఇక నుంచి పాన్‌కార్డ్ ఉంటేనే డీమ్యాట్ ఖాతా తెరవగలరు. అలాగే లక్ష రూపాయలకు మించిన షేర్లు కొన్నపుడు, ఏడాదిలో రూ.50,000 పరిమితి దాటి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నప్పుడు కూడా ఈ వివరాలివ్వాలి. లిస్ట్‌కాని కంపెనీకి సంబంధించిన షేర్లు రూ 1,00,000కు మించి కొన్నా, అమ్మినా వివరాలు ఇవ్వాలి. డిబెంచర్లు, బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే బాండ్లు రూ.50,000 దాటి కొన్నప్పుడు. ఏడాదికి జీవిత బీమా ప్రీమియం రూ.50,000 దాటి చెల్లించినప్పుడు పాన్‌కార్డు వివరాలు పేర్కొనాలి.
 
ఇకపై కొన్ని భారీ వ్యయాలు చేసినప్పుడు పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. అవేంటంటే...
* స్థిరాస్తి క్రయవిక్రయ విలువ రూ.10 లక్షలు దాటితే పాన్‌కార్డ్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ కొన్నవారు, అమ్మినవారు ఇద్దరూ కూడా పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ విలువ రూ. 5 లక్షలుండేది.
* ప్రతి మోటార్ వాహనం కొనుగోలు సమయంలోనూ పాన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వా లి. దీన్నుంచి ద్విచక్ర వాహన లావాదేవీలను మాత్రం మినహాయించారు.
* ఇకపై ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లి రూ. 50,000 మించి బిల్ చేస్తే అప్పుడు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సిందే.
* రూ. 2,00,000 మించి ఏదైనా బంగారు ఆభరణం కొంటే కూడా పాన్ వివరాలివ్వాలి. ఈ పరిమితిని రూ. 5,00,000 పెంచాలని గోల్డ్ జ్యూయెలరీ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
* బంగారం ఆభరణాలే కాదు! ఇకపై ఏ క్రయవిక్రయమైనా ఆ వ్యవహారం విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ కార్డ్ వివరాలివ్వాలి.
* విదేశీ ప్రయాణాల్లో నగదుతో టికెట్లు కొన్నప్పుడు, నగదుతో విదేశీ కరెన్సీ కొన్నప్పుడు కూడా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి.
 
దాచేస్తే.. శిక్ష తప్పదు..
ఈ పైన పేర్కొన్న లావాదేవీలన్నింటిలో పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఈ వివరాలివ్వకపోయినా.. తప్పుడు వివరాలిచ్చినా పెనాల్టీతో పాటు 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నా, వేరే వారి పాన్‌కార్డ్ వివరాలు పేర్కొన్నా కూడా శిక్ష తప్పదు. అలాగే పాన్ కార్డు ఉండి వివరాలివ్వకపోయినా దాన్ని నేరంగానే పరిగణిస్తారు. పాన్‌కార్డు అవసరం లేనివారు ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఫారమ్-60 డిక్లరేషన్ ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ ఈ డిక్లరేషన్‌లో ఉన్నది తప్పుడు సమచారం అని తేలితే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు.

120 కోట్ల దేశ జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 3-4 శాతం లోపే. చాలామంది పన్ను పరిధిలో ఉన్నా, లావాదేవీలను బ్లాక్‌లో నడిపించడం ద్వారా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ బ్లాక్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తూ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్నదే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. తద్వారా వీరినందరినీ ట్యాక్స్ బ్రాకెట్‌లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక నుంచి పాన్‌కార్డు వివరాలను సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవడంతో పాటు, లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా ఒరిజినల్ పాన్‌కార్డ్ ఉండేలా చూసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement