Life insurance premium
-
కొంపముంచుతున్న ఇన్సూరెన్స్ మోసాలు.. చెక్ పెట్టండిలా
గత ఆర్థిక సంవత్సరపు (2021–22) ఎకనమిక్ సర్వే ప్రకారం దేశీయంగా జీవిత బీమా పాలసీల విస్తృతి 2.82 శాతం (2019లో) నుంచి 2020లో 3.20 శాతానికి పెరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చితి భయాల కారణంగా ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తించడం పెరిగింది. అయితే, డిజిటలీకరణ నేపథ్యంలో బీమా సంబంధ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. డేటా అంతా ఆన్లైన్లో దొరుకుతుండటంతో అమాయక కస్టమర్లను స్కామర్లు సులభంగా మోసం చేయడానికి ఆస్కారం ఉంటోంది. వీటిని అరికట్టేందుకు పరిశ్రమ తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల మోసాలు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం. ఫోన్ మోసాలు: కస్టమర్లను తప్పుదోవ పట్టించి వారిని మోసగించేందుకు స్కామర్లు ఎక్కువగా ఉపయోగించే విధానం ఇది. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ ఏజంట్లుగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, తప్పుడు జీవిత బీమా ప్లాన్లను అంటగడుతూ ఉంటారు. ఈ–మెయిల్ మోసాలు: ప్రీమియంలు కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందంటూ కస్టమరుకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మెయిల్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి, పేమెంట్ చేయడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తాయి. నకిలీ వెబ్సైట్లు: కొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వెబ్సైట్లు ఎలాంటి పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, కేవైసీ, హెల్త్ చెక్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తామని చెబుతుంటాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సైన్ అప్ చేస్తే చాలని ఊరిస్తాయి. తద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరిస్తాయి. లబ్ధిదారులకు చెల్లింపులు: ఈ రకం స్కాముల్లో .. ఎవరో దూరపు చుట్టం పాలసీకి సంబంధించి లబ్ధిదారు మీరేనంటూ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని పొందేందుకు నామమాత్రంగా ముందు కొంత డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత డబ్బు కట్టాలని వాటిలో ఉంటుంది. కట్టారో అంతే సంగతులు. ఓటీపీమోసాలు: ఇలాంటి కేసుల్లో.. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అలాగే, నకిలీ యాప్‌లు, మాల్వేర్ లింకులను పంపి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించవచ్చు. అనధికారిక వ్యక్తులు పాలసీలను విక్రయించడం: కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు సిసలైనవిగా అనిపించినప్పటికీ వాటికి ఐఆర్డీఏఐ అనుమతులు ఉండకపోవచ్చు. అలాంటి సంస్థలు అక్రమమైనవి. వాటి నుంచి పాలసీలు తీసుకుంటే మోసపోతారు. తప్పుడు పాలసీలు అంటగట్టడం: మొత్తం ఖర్చుల గురించి మీకు పూర్తిగా వివరించకుండా బీమా పాలసీని అంటగట్టడం ఈ కోవకి వస్తుంది. అంతే గాకుండా పాలసీలో ఆఫర్ చేస్తున్న దానికి మించి మీకు మరిన్ని ప్రయోజనాలు వచ్చేలా చేస్తామంటూ తప్పుడు హామీలు కూడా ఇవ్వొచ్చు. ఇలా చేయండి .. కస్టమర్లు ఇలాంటి మోసాల బారిన పడకుండా బీమా కంపెనీలు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ కస్టమర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటంటే.. ► పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్లో చెప్పొద్దు. ► గుర్తు తెలియని వారి దగ్గర్నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్‌లో పేమెంట్ లింకులపై క్లిక్ చేయొద్దు. ►మరీ అతిశయమైన ఆఫర్లు ఇచ్చే నకిలి వెబ్సైట్లు, ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమా కంపెనీ వెబ్సైట్లో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు సమర్పించే ముందు అది సురక్షితమై న, సిసలైన పోర్టలేనా అని ధృవీకరించుకోవాలి. ►మీ క్లెయిమ్‌ను సెటిల్ చేసేందుకు లేదా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు బీమా కంపెనీలు ఎటువంటి డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను కోరవు అని గుర్తుంచుకోండి. ►మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీలను థర్డ్ పార్టీలు లేదా గుర్తు తెలియని వారికి చెప్పకండి. ►సంతకాలు లేదా చెల్లింపులు చేసే ముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోండి. ►బీమా ఏజెంట్లు అసలైన వారేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు వారి ఐడీ ప్రూఫ్‌లను పరిశీలించండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా ఏదైనా జరిగితే సత్వరం ఐఆర్డీఏఐ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం శ్రేయస్కరం. అనిల్ పి.ఎం., హెడ్ (లీగల్ అండ్ కాంప్లయెన్స్ విభాగం), బజాజ్ అలయంజ్ లైఫ్ -
నూతన ప్రీమియం ఆదాయం రూ.3.14 లక్షల కోట్లు ..ఎల్ఐసీ ఆదాయం ఎంతంటే..?
న్యూఢిల్లీ: అన్ని జీవిత బీమా సంస్థలకు సంబంధించి నూతన ప్రీమియం ఆదాయం 2021–22లో 13 శాతం వృద్ధితో రూ.3,14,263 కోట్లకు దూసుకుపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 24 జీవిత బీమా కంపెనీల ఉమ్మడి ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో) ఆదాయం రూ.2,78,278 కోట్లుగా ఉన్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎల్ఐసీ నూతన బిజినెస్ ప్రీమియం 8 శాతం వృద్ధితో రూ.1,98,760 కోట్లుగా నమోదైంది. అంతకుందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,84,174 కోట్లుగా ఉండడం గమనార్హం. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.1,15,503 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.94,103 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగింది. చదవండి: 2021–22లో 1.67 లక్షల కొత్త కంపెనీలు...ఆ రాష్టంలోనే అధికం..! -
బీమా పాలసీదారులకు శుభవార్త!
బీమా పాలసీదారులకు శుభవార్త. ఇస్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డిఎఐ), జీవిత బీమా కంపెనీల ముందు కొత్త ముసాయిదా మార్గదర్శకాలను ఉంచింది. ఐఆర్డిఎఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ముందస్తుగా ప్రీమియంలు చెల్లించే వారికి రాయితీలు లేదా వడ్డీ చెల్లిచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీమా సంస్థలతో చర్చించింది. అనేక మంది వివిధ రకాల కారణాలతో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను గడువులోగా చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. దీని వల్ల కొన్నిసార్లు మధ్యలోనే పాలసీ రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందుకోసమే పాలసీదారులు గడువు కన్నా ముందుగానే ప్రీమియంలు చెల్లించేలా ప్రోత్సహించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలిపింది. దానిలో భాగంగానే సకాలంలో చెల్లించిన వారికీ రాయితీలు ఇవ్వాలని ఐఆర్డిఎఐ పేర్కొంది. దీనివల్ల ఇరువురికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై ముసాయిదా సర్క్యులర్ విడుదల కానుంది. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్ -
పాన్.. లేకుంటే పరేషాన్
ట్యాక్స్ టాక్ * ఇక లావాదేవీలకు పాన్ తప్పనిసరి * బ్యాంకు ఖాతా.. డీమ్యాట్ తెరవాలన్నా కూడా * బ్యాంకు లావాదేవీలన్నిటిపై ఐటీ నిఘా నేత్రం కొత్త సంవత్సరం వస్తూనే... కొత్త నిబంధనలు తెచ్చింది. జనవరి 1 నుంచే... పాన్ నంబరు వెల్లడికి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై పలు రకాల లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరి. సుమారు 20కిపైగా లావాదేవీల విషయంలో దీన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం కొన్ని లావాదేవీలకే దీన్ని పరిమితం చేసినా... రానున్న కాలంలో ఆర్థిక లావాదేవీలన్నిటికీ పాన్ నంబరును తప్పనిసరి చేస్తారని చెప్పటానికి దీన్నొక సంకేతంగా భావించొచ్చు. అంతేకాదు! పాన్‌కార్డు వివరాలను పేర్కొనకపోయినా, తప్పుడు వివరాలు అందించినా పెనాల్టీతో పాటు జైలు శిక్షా పడుతుంది. జనవరి 1, 2016 నుంచి ఈ దిగువ పేర్కొన్న లావాదేవీల్లో పాన్ కార్డు వివరాలను పేర్కొనాల్సి ఉంది. బ్యాంకులో డిపాజిట్ చేసేటపుడు రూ.50వేలు దాటితే పాన్ నెంబరును ఇవ్వాలన్న నిబంధన గతంలోనూ ఉంది. అయితే దాన్ని తప్పించుకోవటానికి సురేష్ ఎప్పుడూ రూ.49,999 మాత్రమే డిపాజిట్ చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేసినా పాన్ అవసరం లేదు కనక తన లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి ఉండదన్నది సురేష్ నమ్మకం. ఇప్పటిదాకా సాగినా ఇలాంటివాళ్ల ఆటలిక సాగవు. ఏడాదిలో రూ.5 లక్షలకుపైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారిప్పుడు. అంటే సురేష్ మాదిరి రూ.49,999 చొప్పున 10 సార్లు డిపాజిట్ చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అదే 11వ సారి చేస్తే మాత్రం పాన్ నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు!! ఇకపై మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరి. బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు పాన్ కూడా వివరాలివ్వాలి. ఇక ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్‌కూ పాన్ తప్పనిసరి. అలాగే మీ ఖాతాలో రోజుకు రూ.50,000 మించి నగదు డిపాజిట్ చేసినా... మీ పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. ఒక రోజులో రూ.50,000 మించి డీడీలు, బ్యాంకర్ల చెక్కులు తీసుకున్నప్పుడు కూడా పాన్ ఇవ్వాలి. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ చట్టం ప్రకారం క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీ విలువ రూ.50,000 దాటితే అలాంటి సమయంలో కూడా పాన్ కార్డు వివరాలివ్వాలి. అలాగే క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాన్‌కార్డు ఉండాలి. దీనర్థం ఇక నుంచి మీ ప్రతి బ్యాంక్ లావాదేవీనీ ఆదాయ పన్ను శాఖ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. షేర్ల లావాదేవీల్లో... ఇక నుంచి పాన్‌కార్డ్ ఉంటేనే డీమ్యాట్ ఖాతా తెరవగలరు. అలాగే లక్ష రూపాయలకు మించిన షేర్లు కొన్నపుడు, ఏడాదిలో రూ.50,000 పరిమితి దాటి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నప్పుడు కూడా ఈ వివరాలివ్వాలి. లిస్ట్‌కాని కంపెనీకి సంబంధించిన షేర్లు రూ 1,00,000కు మించి కొన్నా, అమ్మినా వివరాలు ఇవ్వాలి. డిబెంచర్లు, బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే బాండ్లు రూ.50,000 దాటి కొన్నప్పుడు. ఏడాదికి జీవిత బీమా ప్రీమియం రూ.50,000 దాటి చెల్లించినప్పుడు పాన్‌కార్డు వివరాలు పేర్కొనాలి. ఇకపై కొన్ని భారీ వ్యయాలు చేసినప్పుడు పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. అవేంటంటే... * స్థిరాస్తి క్రయవిక్రయ విలువ రూ.10 లక్షలు దాటితే పాన్‌కార్డ్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ కొన్నవారు, అమ్మినవారు ఇద్దరూ కూడా పాన్‌కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ విలువ రూ. 5 లక్షలుండేది. * ప్రతి మోటార్ వాహనం కొనుగోలు సమయంలోనూ పాన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వా లి. దీన్నుంచి ద్విచక్ర వాహన లావాదేవీలను మాత్రం మినహాయించారు. * ఇకపై ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లి రూ. 50,000 మించి బిల్ చేస్తే అప్పుడు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. * రూ. 2,00,000 మించి ఏదైనా బంగారు ఆభరణం కొంటే కూడా పాన్ వివరాలివ్వాలి. ఈ పరిమితిని రూ. 5,00,000 పెంచాలని గోల్డ్ జ్యూయెలరీ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. * బంగారం ఆభరణాలే కాదు! ఇకపై ఏ క్రయవిక్రయమైనా ఆ వ్యవహారం విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ కార్డ్ వివరాలివ్వాలి. * విదేశీ ప్రయాణాల్లో నగదుతో టికెట్లు కొన్నప్పుడు, నగదుతో విదేశీ కరెన్సీ కొన్నప్పుడు కూడా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. దాచేస్తే.. శిక్ష తప్పదు.. ఈ పైన పేర్కొన్న లావాదేవీలన్నింటిలో పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఈ వివరాలివ్వకపోయినా.. తప్పుడు వివరాలిచ్చినా పెనాల్టీతో పాటు 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నా, వేరే వారి పాన్‌కార్డ్ వివరాలు పేర్కొన్నా కూడా శిక్ష తప్పదు. అలాగే పాన్ కార్డు ఉండి వివరాలివ్వకపోయినా దాన్ని నేరంగానే పరిగణిస్తారు. పాన్‌కార్డు అవసరం లేనివారు ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఫారమ్-60 డిక్లరేషన్ ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ ఈ డిక్లరేషన్‌లో ఉన్నది తప్పుడు సమచారం అని తేలితే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 120 కోట్ల దేశ జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 3-4 శాతం లోపే. చాలామంది పన్ను పరిధిలో ఉన్నా, లావాదేవీలను బ్లాక్‌లో నడిపించడం ద్వారా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ బ్లాక్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తూ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్నదే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. తద్వారా వీరినందరినీ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక నుంచి పాన్‌కార్డు వివరాలను సెల్ఫోన్లో సేవ్ చేసుకోవడంతో పాటు, లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా ఒరిజినల్ పాన్‌కార్డ్ ఉండేలా చూసుకోండి.