గత ఆర్థిక సంవత్సరపు (2021–22) ఎకనమిక్ సర్వే ప్రకారం దేశీయంగా జీవిత బీమా పాలసీల విస్తృతి 2.82 శాతం (2019లో) నుంచి 2020లో 3.20 శాతానికి పెరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చితి భయాల కారణంగా ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తించడం పెరిగింది.
అయితే, డిజిటలీకరణ నేపథ్యంలో బీమా సంబంధ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. డేటా అంతా ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో అమాయక కస్టమర్లను స్కామర్లు సులభంగా మోసం చేయడానికి ఆస్కారం ఉంటోంది. వీటిని అరికట్టేందుకు పరిశ్రమ తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల మోసాలు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం.
ఫోన్ మోసాలు: కస్టమర్లను తప్పుదోవ పట్టించి వారిని మోసగించేందుకు స్కామర్లు ఎక్కువగా ఉపయోగించే విధానం ఇది. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ ఏజంట్లుగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, తప్పుడు జీవిత బీమా ప్లాన్లను అంటగడుతూ ఉంటారు.
ఈ–మెయిల్ మోసాలు: ప్రీమియంలు కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందంటూ కస్టమరుకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మెయిల్‌లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి, పేమెంట్ చేయడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తాయి.
నకిలీ వెబ్‌సైట్లు: కొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వెబ్‌సైట్లు ఎలాంటి పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, కేవైసీ, హెల్త్ చెక్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తామని చెబుతుంటాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సైన్ అప్ చేస్తే చాలని ఊరిస్తాయి. తద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరిస్తాయి.
లబ్ధిదారులకు చెల్లింపులు: ఈ రకం స్కాముల్లో .. ఎవరో దూరపు చుట్టం పాలసీకి సంబంధించి లబ్ధిదారు మీరేనంటూ ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని పొందేందుకు నామమాత్రంగా ముందు కొంత డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత డబ్బు కట్టాలని వాటిలో ఉంటుంది. కట్టారో అంతే సంగతులు.
ఓటీపీమోసాలు: ఇలాంటి కేసుల్లో.. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అలాగే, నకిలీ యాప్‌లు, మాల్‌వేర్ లింకులను పంపి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సూచించవచ్చు. అనధికారిక వ్యక్తులు పాలసీలను విక్రయించడం: కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు సిసలైనవిగా అనిపించినప్పటికీ వాటికి ఐఆర్‌డీఏఐ అనుమతులు ఉండకపోవచ్చు. అలాంటి సంస్థలు అక్రమమైనవి. వాటి నుంచి పాలసీలు తీసుకుంటే మోసపోతారు.
తప్పుడు పాలసీలు అంటగట్టడం: మొత్తం ఖర్చుల గురించి మీకు పూర్తిగా వివరించకుండా బీమా పాలసీని అంటగట్టడం ఈ కోవకి వస్తుంది. అంతే గాకుండా పాలసీలో ఆఫర్ చేస్తున్న దానికి మించి మీకు మరిన్ని ప్రయోజనాలు వచ్చేలా చేస్తామంటూ తప్పుడు హామీలు కూడా ఇవ్వొచ్చు.
ఇలా చేయండి ..
కస్టమర్లు ఇలాంటి మోసాల బారిన పడకుండా బీమా కంపెనీలు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ కస్టమర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటంటే..
► పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్‌లో చెప్పొద్దు.
► గుర్తు తెలియని వారి దగ్గర్నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌లో పేమెంట్ లింకులపై క్లిక్ చేయొద్దు.
►మరీ అతిశయమైన ఆఫర్లు ఇచ్చే నకిలి వెబ్‌సైట్లు, ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు సమర్పించే ముందు అది సురక్షితమై న, సిసలైన పోర్టలేనా అని ధృవీకరించుకోవాలి.
►మీ క్లెయిమ్‌ను సెటిల్ చేసేందుకు లేదా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు బీమా కంపెనీలు ఎటువంటి డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను కోరవు అని గుర్తుంచుకోండి.
►మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీలను థర్డ్ పార్టీలు లేదా గుర్తు తెలియని వారికి చెప్పకండి.
►సంతకాలు లేదా చెల్లింపులు చేసే ముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోండి.
►బీమా ఏజెంట్లు అసలైన వారేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు వారి ఐడీ ప్రూఫ్‌లను పరిశీలించండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా ఏదైనా జరిగితే సత్వరం ఐఆర్‌డీఏఐ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం శ్రేయస్కరం.
అనిల్ పి.ఎం.,
హెడ్ (లీగల్ అండ్
కాంప్లయెన్స్ విభాగం),
బజాజ్ అలయంజ్ లైఫ్
Comments
Please login to add a commentAdd a comment