బాబోయ్ బ్యాంకు చార్జీలు!
* ప్రతి లావాదేవీకీ వడ్డింపే వడ్డింపు
* కనీస నిల్వ నుంచి స్టేట్‌మెంట్ వరకూ ఇదే తీరు
* ఏటీఎం లావాదేవీలు సహా అన్నిటికీ పరిమితులే
* టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న ఖర్చు
* ఖాతాదారులకు మాత్రం అందని ప్రయోజనం
* ఆన్‌లైన్లో నేరుగా లావాదేవీలు జరుపుకున్నా చార్జీల మోత
* ముందే తెలుసుకోకపోతే జేబుకు ప్రమాదమే!!
ఖాతాదారులందరికీ బ్యాంకులు పాస్ బుక్కులిచ్చేవి. ప్రతి లావాదేవీనీ ఆ పాస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేవి. నగదు కావాలనుకున్నవారు బ్యాంకుకు వచ్చి విత్‌డ్రాయల్ స్లిప్‌పై రాసి.. డ్రా చేసుకునేవారు. వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయాలంటే... అది కూడా బ్యాంకుకొచ్చి, చెక్కు ఇస్తేనే సాధ్యమయ్యేది. అయితే ఇదంతా గతం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పాస్‌బుక్‌లు లేవు. విత్‌డ్రాయల్స్ నేరుగా ఏటీఎంలలోనే. నగదు బదిలీ నేరుగా కస్టమరే చేసుకోవచ్చు. నిజమే!! ఖాతాదారులకు దీంతో చాలా మేలు జరిగింది.
మరి ఖాతాదారులకేనా? పాస్‌బుక్‌లివ్వటం, వాటిని అప్‌డేట్ చేయటం... మూడు నెలలకోసారి ఇళ్లకు స్టేట్‌మెంట్లు పంపటం... నగదు బదిలీకి, విత్‌డ్రాయల్స్‌కు సిబ్బంది పని చేయాల్సి రావటం... ఇవన్నీ బ్యాంకులకూ మిగిలినట్టేగా? టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్యాంకులకూ లబ్ధి కలిగినట్లేగా? మరి ఈ సర్వీసులన్నిటికీ ఇంతకు ముందు లేని చార్జీలు ఇపుడెందుకు వేస్తున్నారు? స్టేట్‌మెంటుకు రూ.100, ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకీ రూ.20పైనే, నగదు బదిలీ చేసినా, ఖాతా ఉన్న బ్రాంచి కాకుండా వేరొక బ్రాంచిలో డిపాజిట్ చేసినా ఎందుకు వడ్డిస్తున్నారు?
ఇలాగైతే ఖాతాదారులందరినీ డిజిటల్ వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అసలే ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రతపై బోలెడన్ని భయాలున్నాయి. దానికి తగ్గట్టే ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మోసపోవటమూ తప్పట్లేదు. ఇన్నిటి మధ్యా బ్యాంకులు కూడా చార్జీలు వడ్డిస్తుంటే ఖాతాదారులేమైపోవాలి? అసలు బ్యాంకులనే కాదు!! డిజిటైజేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రైల్వేల్లాంటివి కూడా కస్టమర్లపై అదనంగా బాదుతున్నాయంటే ఏమనుకోవాలి?
వినియోగదారులకు అందని టెక్నాలజీ లాభం
బ్యాంకింగ్ టెక్నాలజీ వల్ల ఏమైనా మార్పులొస్తే అవి ఖాతాదారులకు మేలు చేయాలి. కానీ ఏటీఎంలకు ఖాతాదారుల్ని అలవాటు చేయడానికి... బ్యాంకుల్లో జరిపే లావాదేవీలపై చార్జీలు విధించారు. దీంతో అంతా ఏటీఎంలకు అలవాటు పడ్డారు. అంతలో ఏటీఎం లావాదేవీలకూ పరిమితులు పెట్టి... ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైపు మళ్లించారు. సరే కదా అని నెట్ బ్యాంకింగ్ పై ఆధారపడితే... ప్రతి లావాదేవీకీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉన్నారు. అంటే... బ్యాంకులకెళ్లినా, వెళ్లకున్నా పరిమాణంలో తేడా తప్ప మోత మాత్రం తప్పటం లేదు. పెపైచ్చు ప్రతిదానికీ పరిమితులే. గీత దాటితే పెనాల్టీలు కూడా.
ఇదీ... చార్జీలు వడ్డిస్తున్న తీరు
ప్రతీ నెలా ఖాతాలో బ్యాంకు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ లేకపోతే.. రూ.50 నుంచి మొదలై రూ.600 పైగా పెనాల్టీలు ఉంటున్నాయి. వీటికి మళ్లీ సేవా పన్నులు, సెస్సులు గట్రా అదనం. అందుకే ఆయా బ్యాంకులు నిర్దేశించిన కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఖాతాలో ఉండేలా చూసుకోవటం ఉత్తమం.
* ఏటీఎంల వాడకానికి వస్తే... ప్రాంతాన్ని బట్టి (మెట్రోలు, సిటీలు మొదలైనవి) పరిమితులొచ్చేశాయి. చాలా మటుకు సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో మాత్రం నెలకు 3 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయటం మాత్రమే లావాదేవీ అనుకుంటారు చాలా మంది. అదేమీ కాదు. బ్యాలెన్సు ఎంక్వయిరీ చేసినా... మినీ స్టేట్‌మెంట్ తీసుకున్నా అవి కూడా లావాదేవీలే. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 నుంచి రూ. 20 పైగానే చార్జీలుంటున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకూ ఏటీఎంలో తక్కువ లావాదేవీలు నిర్వహించడమే ఉత్తమం.
* నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించినా బాదుడు తప్పదు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకును తీసుకుంటే బేస్ బ్రాంచ్‌లో (ఒక సిటీలోని అన్ని శాఖలు.. క్యాష్ యాక్సెప్టర్ మెషీన్‌లలో) నెలకు నాలుగు నగదు లావాదేవీలు మాత్రమే ఉచితం. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ అన్నీ కలిసి నాలుగన్న మాట. ఆ తర్వాత ప్రతి రూ.1,000కి అదనంగా రూ. 5 మేర చార్జీ ఉంటుంది. ఇక బేస్ బ్రాంచ్ కాకుండా వేరే నగరంలోని శాఖల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 చొప్పున చార్జీ ఉంటోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ (సెల్ఫ్) లావాదేవీలు ఐదు దాటాయంటే, ఆరో దాన్నుంచి ప్రతీ లావాదేవీకి రూ. 100 చొప్పున చార్జీలుంటున్నాయి. వీటికి పన్నులు అదనం.
* పలు బ్యాంకులు డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులకు వార్షికంగా రూ.100 నుంచి నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే ఎలాగూ వాటికి అదనపు ఛార్జీలు తప్పవు. కాకపోతే కొన్ని బ్యాంకులు మీ కార్డు చెల్లుబాటయ్యే గడువు ఇంకా ఉన్నా సరే... కొత్త కార్డులొచ్చాయని, మీ ఫోటో పెట్టుకోవచ్చని... ఇలా రకరకాల స్కీమ్‌లతో వసూళ్లు మొదలెడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.
* ఖాతాదారు నుంచి వసూలు చేసుకునే ఏ అవకాశాన్నీ వదలని బ్యాంకులు .. ఆఖరికి ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లను కూడా విడిచిపెట్టడం లేదు. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపినందుకు ప్రతి మూణ్నెల్లకోసారి రూ.15 పై చిలుకు వసూలు చేస్తున్నాయి.
* కొన్ని బ్యాంకుల్లో పాస్‌బుక్కులు అడిగితే తప్ప ఇవ్వటం లేదు. నెట్‌బ్యాంకింగ్ ఉంది కనక మీరు స్టేట్‌మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వీసా వంటి అవసరాల కోసం కొన్ని సంస్థలు బ్యాంకు ముద్ర, అధికారి సంతకం ఉన్న స్టేట్‌మెంట్లు మాత్రమే అడుగుతున్నాయి. సంతకం అవసరం లేని డిజిటల్ స్టేట్‌మెంట్లను అంగీకరించటం లేదు. దీంతో స్టేట్‌మెంట్ కోసం బ్యాంకుకెళితే... అది ఒక పేజీ ఉన్నా సరే రూ.100 చెల్లించాల్సిందే.
ఆన్‌లైన్ అయినా తప్పని మోత...
బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల్లో నగదు బదిలీ సర్వీసులు చేసే విధానాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా లావాదేవీలకూ బ్యాంకులు వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. అటు రైల్వే టికెట్ల బుకింగ్‌లు మొదలుకుని ఇటు కరెంటు, వాటర్ బిల్లులు వంటి వాటికి ఆన్‌లైన్లో కట్టినా అదనపు చార్జీలు తప్పటం లేదు. ఒకవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహిస్తున్నామంటూ.. మరోవైపు ఇలాంటి వడ్డింపులే ంటనే విమర్శలు వస్తున్నాయి.
బిజినెస్ కరస్పాండెంట్లు మరీను!!
గతంలో ఒకే నగరంలో ఏ శాఖ నుంచైనా తన ఖాతాలో డిపాజిట్ చేసుకునే వీలుండేది. కొన్ని బ్యాంకులిపుడు దీనిక్కూడా చార్జీలు విధిస్తున్నాయి. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఏర్పాటు చే స్తున్న బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) విధానం... కొన్నిచోట్ల మరీ ఘోరం. బిజినెస్ కరస్పాండెంట్లు బ్యాంకు నుంచి కమిషన్ పొందాలి తప్ప కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. కానీ ప్రతి డిపాజిట్‌కూ కోత తప్పటం లేదు. రూ.5 వేలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.100 కోత వేయటం మరీ విచిత్రం.
ఇంకో చిత్రమేంటంటే చాలా బ్యాంకులు తమ శాఖల్లోనే కిందనో... లేక పక్కనో బిజినెస్ కరస్పాండెంట్లను కూర్చోబెడుతున్నాయి. డిపాజిట్ చెయ్యటానికి బ్యాంకుకు వెళితే... పక్కనున్న బీసీ దగ్గర ఖాళీగా ఉంటుంది అక్కడ డిపాజిట్ చేయమని బ్యాంకు సిబ్బందే సలహా ఇస్తున్నారు. తెలియక అక్కడికెళితే... డబ్బులు తీసుకుని నేరుగా డిపాజిట్ చేసేస్తున్నారు. తీరా చూస్తే అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తం తక్కువగా ఉంటోంది.
అంటే ఛార్జీల్ని మైనస్ చేస్తున్నారన్న మాట!!. ఏదో బ్యాంకుకు దూరంగా ఏర్పాటు చేస్తే కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుంది గానీ... బ్యాంకుల్లోనే ఏర్పాటు చేయటమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్‌బీఐ కూడా నగరాల్లో అయితే సదరు బ్యాంకు శాఖ తనకు 5 కిలోమీటర్ల దూరంలోపు బీసీని పెట్టవచ్చని, పల్లెలు, పట్టణాల్లో అయిలే ఈ దూరం 30 కి.మీ. వరకూ ఉండవచ్చని ఆర్‌బీఐ చెబుతోంది. కానీ పలు బ్యాంకులు దీనికి తూట్లు పొడుస్తూనే ఉన్నాయి.