వేరబుల్స్‌తో స్మార్ట్‌గా బ్యాంకింగ్ | smart banking with different variables! | Sakshi
Sakshi News home page

వేరబుల్స్‌తో స్మార్ట్‌గా బ్యాంకింగ్

Published Mon, Dec 28 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

వేరబుల్స్‌తో స్మార్ట్‌గా బ్యాంకింగ్

వేరబుల్స్‌తో స్మార్ట్‌గా బ్యాంకింగ్

కొంగొత్త టెక్నాలజీలు వస్తున్న కొద్దీ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే విధానాల ముఖచిత్రం మారిపోతోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ వంటివి అందుబాటులోకి రావడంతో ఏ చిన్న లావాదేవీకైనా సెలవు పెట్టుకుని మరీ బ్యాంకుకు వెళ్లాల్సిన అగత్యం చాలా మందికి చాలామటుకు తప్పింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి నెలా సగటున 2.7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. ఈ గణాంకాల నేపథ్యంలో ఖాతాదారుకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి బ్యాంకులు. దీంతో రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వేరబుల్స్‌కి (స్మార్ట్‌వాచీలు మొదలైనవి) ప్రాధాన్యం పెరగనుంది.
 
స్మార్ట్‌వాచీల రాకతో క్రమక్రమంగా బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ ప్యాకెట్‌లోని ఫోన్ల నుంచి మణికట్టుపైన వాచీల వైపు మళ్లుతోంది. ఈ వేరబుల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు ఆయా సందర్భాలకు తగిన ఆఫర్లను అప్పటికప్పుడు ఖాతాదారులకు తెలియజేసే వీలు కలుగుతుంది.

ఉదాహరణకు మీరు ఏదో స్టోర్‌లోకి వెళ్లినప్పుడో లేదా దాని దగ్గరనుంచి వెళుతున్నప్పుడో సదరు స్టోర్‌లో కొనుగోళ్లపై తమ ఖాతాదారులకు అందిస్తున్న పరిమిత కాలపు ప్రమోషనల్ ఆఫర్ సమాచారం మీకు అప్పటికప్పుడు తెలియజేయొచ్చు. అలాగే, మీ బ్యాంకు శాఖ దగ్గర్నుంచి వెళుతుండగా.. ఖాతాల వివరాలు ఇట్టే డిస్‌ప్లే చేయొచ్చు. ఇలా, నిర్దిష్ట ఖాతాదారుల అవసరాలను బట్టి సర్వీసులైనా.. సమాచారమైనా బ్యాంకులు అందించే వీలవుతుంది.
 
మరెన్నో సర్వీసులు..
ఈ టెక్నాలజీ స్మార్ట్ వాచీలకు మాత్రమే పరిమితం కాదు. స్మార్ట్ ఐవేర్ (కళ్లద్దాలు వంటివి), చేతి కదలికలు మొదలైన సంకేతాలకు అనుగుణంగా స్పందించే పరికరాలు తదితర ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా వేరబుల్స్‌లోని సెన్సార్ల ద్వారా లభించే మీ దైనందిన కార్యకలాపాల సమాచారం అంతటినీ క్రోడీకరించి (మీ అనుమతితోనే సుమా..), తగిన సర్వీసులు ఏ విధంగా అందించాలన్నదానిపై బ్యాంకులు కసరత్తు సాగించనున్నాయి. ఉదాహరణకు మీరు ఫిట్‌నెస్ బ్యాండ్ ధరిస్తారనుకుందాం.

దీని ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని (నాడి కొట్టుకునే వేగం, నిద్ర అలవాట్లు, రోజువారీ వ్యాయామం, క్యాలరీల వినియోగం మొదలైనవి) క్రోడీకరించి.. వివిధ బీమా సంస్థల భాగస్వామ్యంతో మీకు అనువైన ఇన్సూరెన్స్ పాలసీని చౌక ప్రీమియంతో సిఫార్సు చేయొచ్చు. అలాగే డాక్టర్ అపాయింట్‌మెంట్లు, వైద్య పరీక్షలు తదితర అంశాలన్నింటికీ సంబంధించి మీకు గుర్తు చేయడం, చెల్లింపులు మొదలైనవి బయోమెట్రిక్ విధానం ద్వారా స్మార్ట్‌వాచీతోనే పూర్తయ్యేలా కూడా చూడొచ్చు.

ఇలా మీ చేతికుండే స్మార్ట్ వాచీ కావొచ్చు.. ఇతరత్రా స్మార్ట్ పరికరాలు కావొచ్చు.. భవిష్యత్ బ్యాంకింగ్‌లో వేరబుల్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే, టెక్నాలజీ పెరిగిపోయినంత మాత్రాన బ్యాంకు శాఖలతో పూర్తిగా పని లేకుండా పోతుందని కాదు. అయితే, లావాదేవీలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో వాటి ప్రాధాన్యతా క్రమం కొంత తగ్గవచ్చు.

ఈ టెక్నాలజీలను, కస్టమర్లను అనుసంధానించడం, అధిక విలువ లావాదేవీల నిర్వహణ తదితర కార్యకలాపాల్లో బ్యాంకు శాఖలు కీలక పాత్ర పోషించవచ్చు. భవిష్యత్‌లో చూడబోయే ట్రెండ్స్‌లో ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటివి మరెన్నో రావొచ్చు. వీటిని అందిపుచ్చుకున్న బ్యాంకులే మనగలవని నిస్సందేహంగా చెప్పవచ్చు.
 
- రాజీవ్ ఆనంద్
 హెడ్, రిటైల్ బ్యాంకింగ్ యాక్సిస్ బ్యాంక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement