ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మంగళూరు : కార్పొరేట్ ఉద్యోగులు పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారని, రోజుకు 6 గంటలకన్నా తక్కువగా నిద్రిస్తున్నారని అసోచామ్ హెల్త్‌కేర్ కమిటీ నివేదిక వెల్లడించింది. యాజమాన్యాల ఒత్తిళ్లతో ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసంబద్ధ టార్గెట్లను నిర్ధేశిస్తుండటంతో ఉద్యోగులు నిద్ర సమస్యలతో పాటు, భౌతిక, మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని, చివరకు విధులకు గైర్హాజరయ్యే పరిస్థితి ఎదురవుతోందని నివేదిక పేర్కొంది. నిద్ర కొరవడటం ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని నివేదికను విడుదల చేస్తూ అసోచామ్ వివరించింది.
పనిప్రదేశాల్లో ఒత్తిళ్లు, పై అధికారుల వేధింపులతో ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపింది. కార్యాలయంలో ఒత్తిళ్ల కారణంగా తాము సరిగ్గా పనిచేయలేకపోతున్నామని, పలు రుగ్మతలు ఎదుర్కొంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం మంది వెల్లడించినట్టు తేలింది. ఇక విధినిర్వహణలో ఒత్తిళ్ల కారణంగా తాము తరచూ తలనొప్పితో బాధపడుతున్నామని మరో 42 శాతం మంది పేర్కొనగా, నిద్ర సమస్యలతో తాము కుంగుబాటుకు లోనవుతున్నామని 49 శాతం మంది చెప్పుకొచ్చారు.
ఇక సర్వేలో పలకరించిన ఉద్యోగుల్లో 16 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నామని చెప్పగా, 11 శాతం మంది డిప్రెషన్‌తో సతమతమవుతున్నామని తెలిపారు. ఇక హైబీపీతో 9 శాతం మంది, డయాబెటిస్‌తో 8 శాతం మంది బాధపడుతున్నట్టు తెలిసింది. స్పాండిలైసిస్‌తో 5.5 శాతం, గుండెజబ్బులతో 4 శాతం కార్పొరేట్ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment