'ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత'
'ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత'
Published Wed, Apr 19 2017 5:40 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
న్యూఢిల్లీ : దేశీయ ఐటీ సంస్థల్లో గుబేలు రేపుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చారు.. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఇక ఎవరు పడితే వారు అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా.. ఉద్యోగుల కట్టడి నెలకొంటోంది. ఈ ప్రభావం దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్రంగా చూపనున్నట్టు తెలుస్తోంది. వ్యయాల భారంతో పాటు ఉద్యోగులపై వేటు కూడా పడనుందని అసోచామ్ పేపర్ బుధవారం నివేదించింది. పెరుగుతున్న రూపాయి కూడా ఎక్స్పోర్ట్ టెక్నాలజీ సంస్థల మధ్య పరిస్థితిని మరింత అతలాకుతలం చేస్తుందని పేర్కొంది.
అమెరికా నుంచి వచ్చే రెమిటెన్స్లు కూడా తగ్గనున్నాయని అసోచామ్ తెలిపింది. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ను దెబ్బతీయనుందని చెప్పింది. వరల్డ్ బ్యాంకు డేటా ప్రకారం రెమిటెన్స్లో అమెరికా భారత్కు రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రెమిటెన్స్లు వస్తున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఐటీ సంస్థలు తమ వర్క్ఫోర్స్ను బలవంతంగా వేరువేరు ప్రాంతాలకు తరలించనున్నారని, కంపెనీల ఖర్చులు, రూపాయి విలువ పెరగడం కంపెనీలకు తక్కువ గుర్తింపు తెచ్చిపెడుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు భారత్ లో ఐటీ దిగ్గజాల నియామకాల్లో, వేతనాల్లో, ఉద్యోగాల్లో కూడా మార్పులు తేనుందని అసోచామ్ నివేదించింది.
Advertisement