ఆర్థికమాంద్యం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీగా కోత పడుతున్నా.. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)
ఉపాధి కల్పనలో ఢిల్లీ బెస్ట్!
Published Sun, Jan 19 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీగా కోత పడుతున్నా.. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) కంపెనీలు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించాయి. పరిశ్రమల సంఘం అసోచామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడయింది. 2013లో ఐటీ, ఐటీ ఆధారిత, ఐటీ హార్డ్‌వేర్ రంగాలే 43 శాతం ఉద్యోగాలను కల్పించాయి. అసోచామ్ గణాంకాల ప్రకారం గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 5.50 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అయితే 2012లో 5.62 లక్షల మంది ఉద్యోగాలు పొందగా గత ఏడాది ఈ సంఖ్య 0.4 శాతం తగ్గింది. అయితే ఈ 5.50 లక్ష ల్లో 1.39 లక్షల ఉద్యోగాలను ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని కంపెనీలే ఇచ్చాయి. మనదేశంలోని కీలక 32 రంగాల్లోని 20 రంగాల్లో కొత్త ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయని అసోచామ్ తెలిపింది.
నిజానికి ఐటీ, ఐటీ ఆధారిత, ఐటీ హార్డ్‌వేర్ రంగాలు గత ఏడాది అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినా, 2012తో పోలిస్తే ఈసారి ఉద్యోగాల కల్పన కాస్త తగ్గింది. 2012లో 2.36 లక్షల ఉద్యోగాలు రాగా, గత ఏడాది ఇది 2.34 లక్షలకు పడిపోయింది. అయితే విద్య, బ్యాంకింగ్, నిర్మాణరంగాలు, ఆర్థిక సేవలు, వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ), మానవ వనరులు, వాణిజ్య ప్రకటనలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, రియల్టీ, రిటెయిల్, టెలికం రంగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనలో ఢిల్లీ-ఎన్సీఆర్‌తోపాటు బెంగళూరు నగరాలు ఏటా అగ్రభాగాన సాగుతూనే ఉన్నాయి. అయితే చెన్నయ్, కోల్‌కతా, ముంబై నగరాల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య భారీగా క్షీణిస్తోంది. హైదరాబాద్ మాత్రం గత ఏడాది అదనంగా ఒకశాతం కొత్త ఉద్యోగాలు ఇచ్చింది. చండీగఢ్, కాన్పూర్, రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ నగరాల్లో ఉద్యోగాల సంఖ్య కాస్త పెరిగిందని ఆసోచామ్ తెలిపింది.
Advertisement
Advertisement