
సంక్షోభ రంగాలకు రాయితీలివ్వాలి
ప్రభుత్వానికి అసోచామ్ విన్నపం
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న రంగాలను గట్టెక్కించడానికి రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. రియల్టీ, విద్యుత్తు, ఉక్కు, ఆభరణాలు, రత్నాలు తదితర రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. ఈ రంగాలను ఆదుకోవడానికి ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, తక్కువ వడ్డీరేట్లకే రుణాలివ్వాలని, ఎగమతిదారులకు వడ్డీరాయితీ స్కీమ్‌ను అందించాలని కోరారు. విద్యుత్ పంపిణి కంపెనీలు(డిస్కమ్‌లు) సమస్యల్లో కూరుకుపోయాయని, వీటిని రక్షించడానికి ఆర్‌బీఐ, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీటిని గట్టెక్కించలేకపోతే అవి నిర్జీవ ఆస్తులుగా, నిరర్ధక ఆస్తులుగా మారిపోతాయని, ఖజానాకు గుదిబండగా తయారవుతాయని హెచ్చరించారు. ఉద్యోగాలు కల్పించే పలు కీలక రంగాలు సమస్యల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. డిమాండ్ లేకపోవడం, అధిక వడ్డీ వ్యయాలు, చౌక దిగుమతులు వెల్లువెత్తుతుండటం దీనికి ప్రధాన కారణాలని వివరించారు. డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉక్కు, సిమెంట్, విద్యుత్ పరికరాలు వంటి నిర్మాణ రంగ మెటీరియల్స్‌కు స్వల్పకాలిక ప్యాకేజీని ఇవ్వాలని పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాల రంగానికి వడ్డీ రాయితీ వంటి స్కీమ్‌లు వర్తింపజేయాలని సూచించారు. ప్రత్యేక రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందన్న భావన సరికాదని చెప్పారు.