రియల్టీపై మోజు తగ్గిందా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వెనుకబడింది. గతేడాదితో పోలిస్తే రియల్ ఎస్టేట్‌పై పెట్టిన పెట్టుబడులు 3.2 శాతం క్షీణించినట్లు అసోచామ్ సర్వే వెల్లడించింది. సెప్టెంబర్, 2012తో ముగిసిన ఏడాది కాలానికి రూ.1.44 లక్షల కోట్లుగా ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విలువ సెప్టెంబర్, 2013 నాటికి రూ.1.39 లక్షల కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇదే సమయంలో దేశం మొత్తంమీద (ఇరవై ప్రధానమైన రాష్ట్రాలు) పెట్టుబడులను తీసుకుంటే ఆరు శాతం క్షీణత నమోదయింది.
అంటే దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రం బెటరే అన్నమాట!!!. ఈ సమీక్షా కాలంలో దేశం మొత్తం మీద రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విలువ రూ.15.39 లక్షల కోట్ల నుంచి రూ.14.51 లక్షల కోట్లకు తగ్గింది. తగ్గిన వృద్ధిరేటు, ద్రవ్య లభ్యత తగ్గడం, కరెన్సీ ఒడిదుడుకులు, ముడి సరుకుల ధరలు పెరగడం, కూలీల లభ్యత తగ్గడం వంటి అనేక అంశాలు గతేడాది రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ తీసినట్లు అసోచామ్ తెలిపింది. ‘రియల్ ఎస్టేట్ సెక్టర్ 2014’ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణలో బాగా వెనుకబడ్డాయి. బీహార్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల్లో ‘రియల్’ బూమ్ కనిపించింది.
2011 నుంచి తిరోగమనమే...
గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విలువ తగ్గుతూ వస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. 2011 సెప్టెంబర్లో (ఏడాది కాలానికి) రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విలువ 2012, సెప్టెంబర్ నాటికి రూ.1.44 లక్షల కోట్లకు తగ్గింది. మరోవంక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రెండు శాతం వృద్ధి నమోదయింది. అయితే వచ్చిన పెట్టుబడుల్ని వినియోగించడంలో మాత్రం జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందుంది. సెప్టెంబర్, 2013 నాటికి రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడుల్లో 72 శాతం వాస్తవ రూపంలోకి రాగా, దేశం మొత్తం మీద చూస్తే 68 శాతమే వినియోగమయ్యాయి. మొత్తం పెట్టుబడుల్లో 9.6% వాటాతో రాష్ర్టం ఆరవ స్థానంలో ఉండగా, 20 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.