
కావేరి గొడవతో సిటీ ఇమేజి.. డ్యామేజి!
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న కావేరీ జలాల వివాదం వల్ల కలిగిన నష్టం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారుల దాడులు, ఆందోళన, విధ్వంసానికి తోడు.. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా మార్గాలు కూడా స్తంభించాయి. సోమవారం చెలరేగిన ఈ అల్లర్ల మూలంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్ ప్రకటించింది. ఐటీ సహా అనేక ప్రధాన కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడ్డ నేపథ్యంలో కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు నగరంలో చెలరేగిన హింస కారణంగా రూ. 22వేల కోట్లనుంచి రూ. 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ హింసాత్మక పరిణామాలు ముఖ్యంగా బెంగళూరులోని వ్యాపార, పరిశ్రమ వర్గాలను నిరుత్సాహపరిచేదిగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్చూన్ 500 కంపెనీలలో దాదాపు అన్నీ ఇక్కడే ఉన్నాయని.. అలాంటి బెంగళూరు నగర ఇమేజి దారుణంగా దెబ్బతిందని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయని, దానివల్ల వ్యాపారాలు, పారిశ్రామిక వర్గం నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయని తెలిపారు. భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు పరువు ఘోరంగా దెబ్బతిందని రావత్ చెప్పారు.
ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని కేంద్రానికి అసోచామ్ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించాలని కోరింది. కనీస ప్రాథమిక అవసరం నీరు అని, ఇది భావోద్వేగ సమస్య అని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు తావులేకుండా పరిష్కరించాలని కోరింది. ప్రశాంతంగా పనిచేసుకునే ఉద్యోగుల్లో ఈ గొడవల వల్ల తీవ్ర భయాందోళనలు కలిగాయని, విదేశాల్లో కూడా ఆందోళన పుడుతోందని అసోచామ్ వ్యాఖ్యానించింది. ఐటీ ఎగుమతుల విషయంలో మంచి స్థానాల్లో ఉన్న బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని తెలిపింది. ఈ రెండురాష్ట్రాల వివాదంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది.