
ఆర్థిక ప్రగతికి కార్యాచరణ ప్రణాళిక
విదేశీ వాణిజ్య రుణాల నిబంధనలను సరళీకరించాలనీ, వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేయాలనీ అసోచామ్ కోరింది.
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్య రుణాల నిబంధనలను సరళీకరించాలనీ, వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేయాలనీ అసోచామ్ కోరింది. ఆర్థికాభివృద్ధి జోరందుకోవడానికి కొత్త ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సూచించింది. మెగా ప్రాజెక్టులకు భూసేకరణ, పర్యావరణ అనుమతుల కోసం సంబంధిత శాఖలతో జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ గురువారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. జీఎస్‌టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ సుమారు రెండు శాతం వృద్ధిచెందుతుందని చెప్పారు. ఎకానమీ 9-10 శాతం అభివృద్ధి రేటు సాధించే లక్ష్యంతో అసోచామ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలోని ముఖ్యాంశాలు:
తయారీ యూనిట్లను ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సులభతరం చేయాలి.
పెట్టుబడులకు సముచిత ప్రోత్సాహాన్నివ్వాలి.
పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల కోసం సింగిల్ విండో ఏర్పాటు చేయాలి.
కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను సడలించాలి.
ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలి.
దాదాపు రూ. లక్ష కోట్ల సమీకరణ కోసం అగ్రస్థానంలోని 10-15 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలి.
ద్రవ్య పటిష్టీకరణకు దీర్ఘకాలిక చర్యలను తక్షణమే చేపట్టాలి.